రాయలసీమ న్యూస్, అనంతపురం: గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న మిలాద్-ఉన్-నబి పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, IPS ఆదేశాల మేరకు గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం పీస్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి గుంతకల్లు DSP A. శ్రీనివాస్ హాజరై ముస్లిం సోదరులందరికీ ముందుగా మిలాద్-ఉన్-నబి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ర్యాలీ నిర్వహణ, మార్గం, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో వివరణాత్మకంగా చర్చ జరిగింది.
పండుగ రోజున పోర్టర్ లైన్ దర్గా నుండి ర్యాలీ ప్రారంభమై ట్రావెలర్స్ బంగ్లా సర్కిల్, DMM గేట్, అంజుమాన్ సర్కిల్, గాంధీ సర్కిల్, NTR సర్కిల్, RTC బస్టాండ్ మీదుగా మస్తానయ్య దర్గా వరకు ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగుతుందని DSP వివరించారు.
ర్యాలీ సందర్భంగా పట్టణంలో మత సామరస్య వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులందరూ పరస్పర సహాయ సహకారాలు అందించి పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు.
ఎవరైనా కావాలని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని DSP హెచ్చరించారు. ర్యాలీని డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో పూర్తిగా కవర్ చేసి పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
ర్యాలీ సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పట్టణ ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు. అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు, నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమావేశంలో పేర్కొన్నారు.
ఈ పీస్ కమిటీ సమావేశంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ B. మనోహర్, కసాపురం ఎస్ఐ వెంకటస్వామి, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. ర్యాలీ విజయవంతం, శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలు వెల్లడించారు.













