రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి పట్టణం తాడిపత్రి రోడ్డులోని లోబేడ బుడగలు కాలనీ వద్ద మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. సోమవారం కాలనీవాసులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. గత కొన్ని రోజులుగా కాలనీకి సక్రమంగా మంచినీరు సరఫరా కావడం లేదని వారు ఆరోపించారు.
మంచినీటి సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలు కొంతసేపు అంతరాయం కలిగాయి.
నిరసన సందర్భంగా కాలనీవాసులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. వేసవి కాలంలోనే కాకుండా ఏడాది పొడవునా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదని, కనీసం తాగునీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే సమస్యను పరిష్కరించి రోజూ క్రమం తప్పకుండా మంచినీటి సరఫరా చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. తమ సమస్యను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. కాలనీలో మంచినీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారుల హామీతో నిరసనకారులు రాస్తారోకో విరమించారు. అనంతరం రహదారిపై వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.













