రాయదుర్గం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కోరారు. తన నియోజకవర్గంలోని వైద్య సదుపాయాల పరిస్థితిపై సభలో మాట్లాడారు.

రాయదుర్గం నియోజకవర్గంలో 35 గ్రామీణ వైద్య కేంద్రాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురావడంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని కాలవ శ్రీనివాసులు అభినందించారు.

రాయదుర్గం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఆసుపత్రి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ స్వయంగా పరిశీలించారని, జిల్లా అధికారుల దృష్టికి కూడా ఇప్పటికే తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.

ఆగిపోయిన సీహెచ్‌సీ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్మాణం పూర్తయితే పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూరులో గత TDP పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తాను మంజూరు చేయించానని కాలవ శ్రీనివాసులు తెలిపారు. అయితే ఎలాంటి వసతులు, వైద్య పరికరాలు లేకుండానే గత YSRCP నాయకులు ఆ భవనాన్ని హడావుడిగా ప్రారంభించారని ఆయన విమర్శించారు.

దర్గా హోన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం అవసరమైన క్వార్టర్స్ నిర్మించడంతో పాటు వైద్య పరికరాలను పూర్తిగా మంజూరు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారానే గ్రామీణ ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేసిన విజ్ఞప్తిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఆసుపత్రుల్లో అవసరమైన వసతుల కల్పనకు ఎంతమేరకు అవకాశం ఉందో పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.