రాయలసీమ న్యూస్, అనంతపురం: గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి శుక్రవారం భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఆలయ విస్తరణ, భక్తుల సౌకర్యాల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రాంతీయ భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ భూమి పూజకు ముఖ్య అతిథిగా గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ముందుగా గుంతకల్లు మండల ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. పత్తి హిమబిందు కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. పురోహితులు, గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు.
తరువాత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆలయంలోకి వెళ్లి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం చేపట్టబోయే అభివృద్ధి పనులపై పురోహితులు, కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే చర్చించారు.
కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఇక్కడికి నిత్యం భక్తులు వస్తుంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. భక్తులకు వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు కూటమి ప్రభుత్వం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను.
కసాపురం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
భూమి పూజ అనంతరం పురోహితుల ఆశీర్వాదాలతో కార్యక్రమం ముగిసింది. ఆలయ విస్తరణ, వసతి గృహాల నిర్మాణం, ఇతర సౌకర్యాల ఏర్పాటుతో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతీయ భక్తులకు మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.













