అనంతపురం: గవర్నర్ కోటాలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న నూతన ఎమ్మెల్సీ వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పదవి దక్కిన తర్వాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆమెకు వడ్డెర్లు, బీసీ సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంతో నీరాజనాలు పలికారు.

జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ రమాదేవి ముందుగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తన కుటుంబ సభ్యులతో కలిసి మార్గమధ్యంలోని సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంతపురం తపోవనం జంక్షన్‌ వద్దకు చేరుకున్న ఆమెకు వడ్డెర కులస్థులు, బీసీ నాయకులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.

తపోవనం జంక్షన్‌ నుండి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వడ్డెర సంఘాలు, బీసీ సంస్థలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రమాదేవి అభిషేకంలో భాగమయ్యారు.

“బీసీల్లో అత్యంత అట్టడుగున ఉన్న వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాలాంటి సాధారణ మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఎంతో సంతోషకరం. ఒక సాధారణ క్లస్టర్ ఇన్ ఛార్జిగా ఉన్న నాకు ఈ పదవి దక్కడంలో ఎమ్మెల్యే దగ్గుపాటి కృషి ఎంతో ఉంది. ఆయనకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నా వడ్డెర కులస్థులు నా వెన్నంటే ఉండి ప్రోత్సహించారు, వారి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తాను.”

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం ఆడబిడ్డకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలని ఈ నిర్ణయంతో మరోసారి నిరూపితమైందని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తే ఎవరికైనా తగిన గుర్తింపు లభిస్తుందనడానికి దళవాయి రమాదేవే నిదర్శనమని అన్నారు.

ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనంతపురం జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ఉందని, అందులో భాగంగానే పిలిచి మరీ ఒక బీసీ మహిళకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారని తెలియజేశారు. గవర్నర్ కోటాలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఎమ్మెల్సీ పదవి కల్పించడం ద్వారా బీసీ వర్గాల పట్ల ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చూపుతున్న ప్రాధాన్యం స్పష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు.