అనంతపురము జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామ సమీపంలో ఉన్న నగరవనం ఎదుట ముళ్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేసి వెళ్లిపోయిన ఘటన స్థానికులను కలచివేసింది. పుట్టిన కొద్ది రోజులే ఉన్నట్లు కనిపిస్తున్న ఆ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసిన విధానం చూసి గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

శనివారం ఉదయం సమయంలో అటుగా గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్న గొర్రెల కాపర్లు ముళ్ల పొదల వైపు నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి వెళ్లి చూసే సరికి ఆడ శిశువు ముళ్ల మధ్య పడిఉండటం గమనించారు. ఆమెను జాగ్రత్తగా బయటకు తీసి స్థానికులకు సమాచారం అందించారు.

గ్రామస్తుల సహకారంతో శిశువును తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శిశువుకు ప్రాథమిక చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

శిశువు ఆరోగ్యం మరింత మెరుగుపడిన తర్వాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ICDS సూపర్వైజర్ ఝాన్సీ తెలిపారు. శిశువు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నట్లు సంబంధిత అధికారులు సూచించారు.

శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముళ్ల పొదల పరిసరాలను పరిశీలించారు. శిశువును అక్కడ వదిలేసిన వారి గురించి సమాచారం సేకరించేందుకు గ్రామస్తులను ప్రశ్నించారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలించే దిశగా చర్యలు ప్రారంభించారు.

ఆడ శిశువును ఈ విధంగా ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ప్రాణాలను కాపాడిన గొర్రెల కాపరి అప్రమత్తతను గ్రామస్తులు అభినందిస్తున్నారు. శిశువును వదిలేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు.

ఈ ఘటనతో ప్రాంతంలో బాలికల భద్రత, శిశు సంరక్షణపై చర్చ మొదలైంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.