అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణంలోని స్థానిక SKP డిగ్రీ కళాశాలలో పట్టణ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి AISF జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ హాజరయ్యారు. విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా వెంకట్ నాయక్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై AISF నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై AISF సమరశీల ఉద్యమాలకు సిద్ధంగా ఉందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఉద్యోగాల విషయంపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై గళం విప్పాలని వెంకట్ నాయక్ డిమాండ్ చేశారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో AISF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

విద్యారంగ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 1న నిర్వహించనున్న "ఛలో ఢిల్లీ" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థులకు, AISF కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాగితపు డిగ్రీలు కాదు, కడుపు నింపే డిగ్రీలు కావాలి

అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన 77 GO నంబర్‌ను రద్దు చేయాలని, డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ BC బాయ్స్ హాస్టల్‌కు సొంత భవనం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సమావేశం అనంతరం పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి: పట్టణ అధ్యక్షులు స్వేంతన్, ప్రధాన కార్యదర్శి షహీర్, కోశాధికారి యశ్వంత్. పట్టణ కార్యవర్గ సభ్యులు 19 మంది, పట్టణ సమితి సభ్యులు 43 మంది గా ఎంపికయ్యారు.

ఈ కార్యక్రమంలో AISF నాయకులు యశ్వంత్, ఆంజనేయులు, మనోజ్, సందీప్, తేజ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగింపులో విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని, AISF కార్యక్రమాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు.