అనంతపురం: ఎన్నికల ముందు కురుబ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కురుబ యువత రాష్ట్ర కన్వీనర్ బిల్లా మంజునాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన కురుబ యువత, నాయకుల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినప్పటికీ కురుబలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని మంజునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కుప్పం నియోజకవర్గంలో శ్రీభక్త కనకదాసు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కురుబ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.

ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు మెంబర్, గుడికట్ట పూజారులకు గౌరవ వేతనం ఇస్తామని ఇచ్చిన మాటను ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని మంజునాథ్ పేర్కొన్నారు. అలాగే కురుబ సామాజిక వర్గానికి దక్కాల్సిన గొర్రెల మేకల ఫెడరేషన్ చైర్మన్ పదవిని వేరే కులానికి కేటాయించడం తీవ్ర బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు.

రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబ సామాజిక వర్గానికి మేయర్, మున్సిపల్ చైర్మన్, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో జనాభా ప్రాతిపదికన తగిన ప్రాధాన్యత కల్పించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలను మంజునాథ్ డిమాండ్ చేశారు. కురుబల ఓటు బ్యాంకును కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తు చేసుకుని, తర్వాత హామీలను పక్కన పెట్టే ధోరణిని అన్ని పార్టీలు మానుకోవాలని ఆయన సూచించారు.

కురుబ యువత, నాయకులు ఐక్యంగా కదిలి తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా మంజునాథ్ పిలుపునిచ్చారు. కురుబలకు రాజకీయ, సామాజిక రంగాల్లో తగిన ప్రతినిధిత్వం లభించే వరకు తమ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేసినట్లు సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బులగొండ మనోహర్, యువత నాయకులు బిల్లా ప్రభాకర్, రుద్రంపేట వేణు, బండి బాలు, పట్నం భార్గవ్, శివదత్త, మల్లెల బాలు, పాముల రామ్మోహన్, చిరుతల ఆనంద్, నిరంజన్, బండి మోహన్, పాల్యం మహేష్, బాలరాజు, జయ తదితరులు పాల్గొన్నారు.