రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా బి.కోడూరు మండలంలోని ఐత్రంపేట గ్రామంలో అదనపు వరకట్న వేధింపులను తట్టుకోలేక ఓ యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై బి.కోడూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐత్రంపేటకు చెందిన సిద్దు రామసుబ్బారెడ్డి, నారాయణమ్మ దంపతుల ఏకైక కుమార్తె సిద్దు అనూష (24)కు ఒంటిమిట్టకు చెందిన పేరూరు సాయినాథ్‌రెడ్డి అనే యువకుడితో సుమారు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. సాయినాథ్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, పెళ్లి అనంతరం దంపతులు రెండు నెలల పాటు హైదరాబాద్‌లో కలిసి నివసించారు.
ఈ కాలంలో, అదనపు వరకట్నం తీసుకురావాలని భర్త పేరూరు సాయినాథ్‌రెడ్డి, అతని తల్లిదండ్రులు ఆమెపై ఒత్తిడి పెంచినట్లు, రోజూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన అనూష గత రెండు నెలలుగా పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనూష ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లి ఉండగా, మనస్తాపంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె విష ద్రావకం తాగినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన ఆమె అమ్మమ్మ, అనూష స్పృహలేని స్థితిలో పడిఉండటం గమనించి, వెంటనే ఆమె తమ్ముడు శ్రీనాథ్‌కు విషయం తెలిపింది.
అనూష పరిస్థితి విషమంగా ఉండటంతో తండ్రి రామసుబ్బారెడ్డి, తమ్ముడు శ్రీనాథ్ కలిసి ఆమెను బైక్‌పై పోరుమామిళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అనూష కొద్దిసేపటికే మృతి చెందింది. అకస్మాత్తుగా జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ సంఘటనపై అనూష తల్లిదండ్రులు, బంధువులు బి.కోడూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం, అనంతర మరణం అంశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త పేరూరు సాయినాథ్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
బి.కోడూరు పోలీసు స్టేషన్ ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వరకట్న వేధింపుల కారణంగా మరో యువతి ప్రాణం కోల్పోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.













