గణితం అనగానే చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. పాఠాలు అర్థం కాక ఇబ్బంది పడుతూ, ఎలాగోలా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే చాలని భావించే వారు కూడా తక్కువేమీ లేరు. కఠినమైన ప్రశ్నలు ఎదురైతే మరీ గందరగోళానికి గురవుతుంటారు. అయితే నందలూరుకు చెందిన ఓ బాలిక మాత్రం అందరికీ భిన్నంగా నిలుస్తోంది. చిటికెలో లెక్కల చిక్కులు విప్పేస్తూ, పోటీల్లో నిర్ణీత సమయానికి ముందే సమాధానాలు చెప్పి జడ్జీలను, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.

హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన గణిత మేధావి శకుంతలాదేవి స్ఫూర్తితో వేద గణితంలో రాణిస్తున్న ఈ బాలిక పేరు చరిత. నందలూరులోని రామనర్సింహులు, శివనాగకుమారి దంపతుల కుమార్తె. చిన్ననాటి నుంచే తండ్రి ప్రోత్సాహంతో గణితంపై ఆసక్తి పెంచుకున్న చరిత, ఇప్పుడు వరుస విజయాలతో అందరి ప్రశంసలు అందుకుంటోంది.

నాలుగేళ్ల వయసులోనే చరిత గణితంలో ప్రాథమిక అంశాలైన కూడికలు, తీసివేతలు, గుణింతాలు, క్యూబ్‌రూట్స్‌పై అవగాహన పెంపొందించుకుంది. ఆరేళ్లకే ఇవన్నీ సులువుగా సాధించడమే కాకుండా, వివిధ దేశాల రాజధానుల పేర్లు చెప్పడం, వాటిని ప్రపంచ పటంలో గుర్తించడం వంటి ప్రతిభను కూడా ప్రదర్శించింది. చిన్న వయసులోనే ఇంతటి మేధస్సు కనబరుస్తుండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చరిత ప్రతిభకు ఇప్పటికే అనేక పురస్కారాలు, పతకాలు వరించాయి. విజయవాడలో నాసో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణిత పోటీల్లో విజేతగా నిలిచి తన సామర్థ్యాన్ని చాటుకుంది. వేదిక్‌ మ్యాథ్స్‌ వాల్యూమ్‌ 1లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షల్లో బంగారు పతకం సాధించింది.

కడపలో జరిగిన జిల్లా స్థాయి వేదిక్‌ మ్యాథ్స్‌ పోటీల్లో పది నిమిషాల్లో పూర్తి చేయాల్సిన 50 లెక్కలను చరిత కేవలం ఎనిమిది నిమిషాల్లోనే పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతరం విజయవాడలో ఏర్పాటు చేసిన మరో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏడున్నర నిమిషాల్లో 50 లెక్కలు పూర్తి చేసి మళ్లీ ప్రథమ స్థానాన్ని దక్కించుకుని బంగారు పతకం, పురస్కారాలు, నగదు పారితోషికం అందుకుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి గణిత పోటీల్లో 19 రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతో పోటీ పడి, తనకిచ్చిన లక్ష్యాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం గెలుచుకుంది. గణితంతో పాటు సాధారణ జ్ఞానంలోనూ తన ప్రతిభను చాటిన చరిత, వంద దేశాల పేర్లను ఎ నుంచి ఎల్‌ వరకు ఆంగ్ల అక్షర క్రమంలో ఒక్క నిమిషం యాభై నాలుగు సెకన్లలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది.

చిన్న వయసులోనే ఇంతటి విజయాలు సాధించిన చరితను స్థానికులు మరో శకుంతలాదేవిగా అభివర్ణిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వంతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.