రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమేయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఆటోలో మరిచిపోయిన రూ.10 లక్షల విలువైన ఆభరణాలను అర్బన్ పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే గుర్తించి బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు చేపట్టిన వేగవంతమైన చర్య స్థానికంగా ప్రశంసలు పొందుతోంది.
రాయచోటికి చెందిన షేక్ మెహరాజ్ ప్రయాణించిన ఆటోలో రూ.10 లక్షల విలువైన ఆభరణాలున్న బ్యాగ్ మరిచిపోయినట్లు సమాచారం. ఆ బ్యాగ్‌లో 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాగ్ మిస్సైన విషయం తెలిసిన వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు అందుకున్న అర్బన్ పోలీసులు వెంటనే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ సంబంధిత ఆటోను గుర్తించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఆ ఆటోను గుర్తించి, అందులో ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ చేసిన ఆభరణాలను రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి, ఎస్‌ఐ విష్ణువర్ధన్ తక్షణమే బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు. మొత్తం ఆభరణాలు యథావిధిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ సంఘటనలో రాయచోటి పట్టణ పోలీసులు చూపిన చురుకుదనాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్, ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ మెరుపు వేగంతో స్పందించిన పట్టణ పోలీసుల సేవలను ఆయన ప్రశంసించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
సీసీటీవీ కెమెరాల వినియోగం ద్వారా నేరాల నిరోధకత, ఆస్తుల రక్షణలో పోలీసుల సామర్థ్యం మరింత పెరుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు తమ విలువైన ఆస్తులను జాగ్రత్తగా సంరక్షించుకోవడంతో పాటు, ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.













