చిత్తూరు జిల్లా మారుమూల ప్రాంతమైన త్రిరాష్ట్ర కూడలిలోని కుప్పం నుంచి దశాబ్దాలుగా వేలాది మంది యువత ఉపాధి కోసం బెంగళూరు నగరానికి వలస వెళ్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి రోజూ 4 నుంచి 5 వేల మంది కూలీలు, కార్మికులు, చిరుద్యోగులు పొరుగు రాష్ట్రంలోని మహానగరానికి వెళ్లే పరిస్థితి కొనసాగుతోంది. వీరి రాకపోకలకు ప్రత్యేకంగా పుష్‌పుల్‌ రైలు కూడా నడుస్తోంది.

ఈ వలసలను అరికట్టడంతో పాటు స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. కుప్పం సమగ్రాభివృద్ధిలో భాగంగా పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టారు.

పెట్టుబడిదారులకు అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందించేందుకు పారిశ్రామికవేత్తలతో ఎంవోయూలు కుదుర్చడంతో పాటు భూముల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చకచకా చర్యలు చేపడుతోంది. పరిశ్రమల స్థాపనకు కేటాయించిన భూములను చదును చేస్తూ నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

గుడుపల్లె మండలంలోని పొగురుపల్లె, శాంతిపురం మండలం రామాపురం, కర్లగట్ట, కుప్పం మండలం పలార్లపల్లె, రామకుప్పం మండలంలోని మణీంద్రం తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించింది. ముఖ్యంగా ఆంధ్రా–కర్ణాటక సరిహద్దులోని పొగురుపల్లె వద్ద దాదాపు వెయ్యి ఎకరాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడను నెలకొల్పనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 900 ఎకరాల భూ సేకరణ పూర్తయింది.

త్వరలోనే ఆహార అనుబంధ పరిశ్రమలతో పాటు ఎలక్ట్రానిక్స్, లెదర్‌ ఫుట్‌వేర్‌, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి యువత కుప్పం వచ్చి ఉపాధి పొందే పరిస్థితి ఏర్పడేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జులై మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. పొగురుపల్లె పారిశ్రామిక వాడలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కొత్తగా రూ.750 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బిస్ ప్రోటీన్స్ (చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌)ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌లో 750 మందికి ఉపాధి లభించనుంది.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నూతనంగా 12 పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొత్తం 28 పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు రూ.8,382.26 కోట్లుగా ఉండగా, వీటి ద్వారా 82,589 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. అందులో 38,395 మందికి ప్రత్యక్షంగా, 44,194 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు రూపొందించారు.

కుప్పం పారిశ్రామిక వాడ అభివృద్ధి పూర్తయితే, ఇప్పటి వరకు బెంగళూరుకు వలస వెళ్తున్న యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించి, వలసలు గణనీయంగా తగ్గే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.