ఇష్టానికి పట్టుదల, కష్టం తోడైతే లక్ష్యాన్ని సాధించవచ్చని చిన్నారులు తమ ప్రతిభతో నిరూపిస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ, తైక్వాండోలో జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న నంద్యాల బాలిక సింధు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నంద్యాల పట్టణం ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన ప్రదీప్, సరస్వతి దంపతుల కుమార్తె సింధు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆటలంటే చిన్ననాటి నుంచే మక్కువ. ఈ ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను తైక్వాండో శిక్షణకు పంపగా, గత నాలుగేళ్లుగా శిక్షకుడు అబ్దుల్ మజీద్ వద్ద క్రమశిక్షణతో సాధన చేస్తూ సింధు తన ప్రతిభను మెరుగుపరుచుకుంటోంది.

రోజూ ఉదయం, సాయంత్రం గంటసేపు శ్రమిస్తూ తైక్వాండోకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటోంది. నిరంతర సాధనతో జిల్లాస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పతకాలు సాధించి ప్రత్యేకతను చాటుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.

సింధు ఇప్పటివరకు సాధించిన విజయాలు విశేషంగా నిలిచాయి. 2022లో నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో వెండి పతకం సాధించింది. 2023లో జార్ఖండ్‌లోని రాంచీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మరో వెండి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అదే సంవత్సరం అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో క్యాంస పతకం, తెనాలిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో కూడా క్యాంస పతకం సాధించింది. 2024లో నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో బంగారు పతకంతో మెరిసింది.

2025లో తాడిపత్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో బంగారు పతకాలు గెలుచుకుని తన స్థాయిని మరింత పెంచుకుంది. అదే ఏడాది డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో క్యాంస పతకం సాధించింది. 2026 మేలో విజయనగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో వెండి పతకం తన ఖాతాలో చేరింది.

చిన్న వయసులోనే ఇంతటి విజయాలు సాధించిన సింధు, నంద్యాల పట్టణానికి, జిల్లాకు గర్వకారణంగా మారింది. కుటుంబం, శిక్షకుడి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న ఆమె, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని మరింత కష్టపడుతోంది.