రాయలసీమ న్యూస్, కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 55 పులుల సంరక్షణ కేంద్రాల కోర్ ఏరియాల్లో సాధారణ ప్రజల సంచారాన్ని అటవీ శాఖ మూడు నెలలపాటు నిషేధించింది. పులుల సంతానోత్పత్తి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (NTCA) మార్గదర్శకాల మేరకు ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
జూలై నుంచి సెప్టెంబరు వరకు పులుల ప్రత్యుత్పత్తి సమయంగా భావిస్తారు. ఈ సమయంలో కోర్ ఏరియాల్లోని అడవుల్లోకి ప్రవేశం, జంగిల్ సఫారీలు, పుణ్యక్షేత్రాల సందర్శనపై ఆంక్షలు విధించారు. ఆన్‌లైన్ బుకింగ్ సేవలను నిలిపివేశారు. బఫర్ ఏరియాల్లోని ఎకో టూరిజం కేంద్రాల్లో విడిది సౌకర్యాలు కొనసాగించినా, సఫారీ సేవలు మాత్రం నిలిపివేశారు.
నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 2024 గణన ప్రకారం 85 పెద్ద పులులు ఉన్నట్లు నమోదు కాగా, 2025 నాటికి వాటి సంఖ్య 90కి చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో మగ పులులు 32, ఆడ పులులు 40, అవయవ నిర్ధారణ కానివి 4, పిల్లలు 14గా ఉన్నట్లు వివరాలు వెల్లడయ్యాయి. పులుల సంతానోత్పత్తి సమయంలో వాటికి ఏకాంతం, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు జన సంచారంపై ఆంక్షలు విధిస్తున్నట్లు అటవీశాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు ప్రజలను అనుమతించరు. ముఖ్యంగా మార్కాపురం అటవీ డివిజన్‌లోని ఇష్టకామేశ్వరీదేవి ఆలయం, వెలుగోడు రేంజ్‌లోని రుద్రకోడూరు క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాల సందర్శనపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.
పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సఫారీలు పూర్తిగా నిలిపివేశారు. మార్కాపురం అటవీ డివిజన్‌లోని తుమ్మల బయలులో సఫారీ సేవలను రద్దు చేశారు. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని బైర్లూటి ఎకో టూరిజం సఫారీని నిలిపివేసినా, ఇది బఫర్ ఏరియాలో ఉండటంతో విడిది సౌకర్యాలను కొనసాగిస్తారు. నంద్యాల డివిజన్‌లోని పచ్చర్లలో కూడా సఫారీలు ఉండవు, అయితే అక్కడ విడిది అనుమతిస్తారు.
పెద్ద పులులు జూలై నుంచి సెప్టెంబరు మధ్య సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఈ సమయంలో వాటి ఏకాంతానికి భంగం కలిగితే దాడి చేసే ప్రమాదం పెరుగుతుందని అటవీశాఖ హెచ్చరిస్తోంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు పాదయాత్రగా వెళ్లే భక్తులు, పర్యావరణ ప్రేమికులకు ఈ ఆంక్షలపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు.
వర్షాకాలం పెద్ద పులుల సంతానోత్పత్తికి అనుకూల సమయం. ఆ సమయంలో అవి ప్రశాంత వాతావరణం, ఏకాంతాన్ని కోరుకుంటాయి. పులుల సంరక్షణకు అందరూ సహకరించాలి. పులులకు ఏకాంత వాతావరణం కల్పించేందుకు జూలై నుంచి అడవిలోకి సాధారణ జన సంచారంపై ఆంక్షలు ఉంటాయి. ప్రజలు సహకరించాలి.
అని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు తెలిపారు. పులుల సంరక్షణ, వాటి భద్రత కోసం అమలు చేస్తున్న ఈ ఆంక్షలను ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేస్తోంది.













