రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..
జోరుగా చర్చలు
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా పార్టీని వీడుతుండటంతో టీఎంసీ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశంపై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో టీఎంసీ, కాంగ్రెస్ నేతల మధ్య ఈ విలీనంపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలను టీఎంసీ, కాంగ్రెస్ అధికారిక వర్గాలు బహిరంగంగా ధృవీకరించలేదు. విలీనంపై వస్తున్న ప్రచారాలను టీఎంసీ నేతలు కొట్టిపారేస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం మమతా బెనర్జీతో ఉన్న టీఎంసీ లోక్‌సభ సభ్యులు ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రహస్యంగా కలిసి చర్చలు జరిపారు. ఈ భేటీ వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినా, ఇరు పార్టీల మధ్య విలీన చర్చలకు ఇది బలం చేకూర్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనను ముందుగా టీఎంసీ నేతలే ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు స్వరాలు వినిపించడం, పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై మమతా బెనర్జీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ కొద్ది రోజుల క్రితం టీఎంసీ–కాంగ్రెస్ విలీనానికి బహిరంగంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల అనంతరం తక్కువ వ్యవధిలోనే అభిషేక్ బెనర్జీ–రాహుల్ గాంధీ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి భవిష్యత్ వ్యూహం, పశ్చిమ బెంగాల్ రాజకీయ సమీకరణాలు, లోక్‌సభలో ప్రతిపక్ష కూటమి బలపరిచే అంశాల నేపథ్యంలో టీఎంసీ–కాంగ్రెస్ విలీన చర్చలు ఎంతవరకు ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అధికారిక స్థాయిలో స్పష్టత వచ్చే వరకు ఈ ఊహాగానాలు కొనసాగే అవకాశముంది.







