రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అర్బన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన తండ్రిని అత్తింటివారు కళ్లముందే దాడి చేసి గాయపరిచిన సంఘటనతో మనస్థాపానికి గురైన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హిందూపురం రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణంలోని పార్థసారథినగర్‌కు చెందిన వెంకటేష్ కుమారుడు పురుషోత్తం (23) పీఆర్‌టీ వీధిలో జరీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు ఏడు నెలల క్రితం నార్పల మండలానికి చెందిన రాజు, సావిత్రి దంపతుల కుమార్తె మాధవితో పురుషోత్తం వివాహం జరిగింది.
వివాహానంతరం మొదటి కొన్ని నెలలు దంపతుల జీవితం సజావుగా సాగింది. అనంతరం చిన్న చిన్న కుటుంబ సమస్యల కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మాధవి తన పుట్టింటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
శుక్రవారం మాధవి తల్లిదండ్రులు, అన్నదమ్ములు కలిసి పురుషోత్తం ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పురుషోత్తం తండ్రి వెంకటేష్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. కన్న తండ్రిని అత్తింటివారు తన కళ్లముందే కొట్టిన ఘటన పురుషోత్తాన్ని తీవ్రంగా కలిచివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ మనస్థాపంతో శనివారం పురుషోత్తం ధర్మవరం పట్టణంలోని డీఎల్‌ఆర్ కాలనీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే కీమెన్ ఈ విషయాన్ని గమనించి హిందూపురం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
తండ్రిని అత్త, మామ, బావమరుదులు కొట్టిన ఘటనతో మనస్థాపం చెంది పురుషోత్తం ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.













