వీబీ జీ రామ్ జీ పథకంతో గ్రామాల్లో అభివృద్ధి: మంత్రి సవిత

శ్రీసత్యసాయి జిల్లా హనుమప్ప పల్లిలో వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. ఈ పథకాన్ని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

హనుమప్ప పల్లిలో రూ.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎంజేపీ గురుకుల పాఠశాల శాశ్వత భవనానికి గురువారం మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ, బీటీ రహదారులు, కాలువలు సహా పలు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలుగుతోందని వివరించారు.

ఈ పథకం కింద చేపట్టే పనులను మరింత నాణ్యతతో అమలు చేయాలని, కూటమి నాయకులు, కార్యకర్తలు పనులపై పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆమె సూచించారు. కూలీలకు రోజుకు రూ.312 వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం ద్వారా కూలీలకు ఉపాధి, ఆదాయం రెండింటిలోనూ పెరుగుదల ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు.

బీసీల విద్యాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఇటీవల పది నూతన ఎంజేపీ గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, వాటిలో మూడు ఎంజేపీ గురుకులాలను ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, పెనుకొండ, కదిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో పెనుకొండ నియోజకవర్గంలో రెండు ఎంజేపీ గురుకులాలను ప్రారంభించామని, అదనంగా మూడు కొత్త బీసీ హాస్టళ్లను కూడా మంజూరు చేసినట్లు ఆమె గుర్తుచేశారు. 2014-19 మధ్య ఆనాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఎంజేపీ గురుకులాల భవన నిర్మాణ పనులను తరువాతి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను పునఃప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు.

అన్ని ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ బీసీ విద్యార్థులు ఇంటర్, టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎంజేపీ గురుకుల విద్యార్థులు మార్కుల సాధనలో అగ్రగామిగా నిలుస్తున్నారని మంత్రి సవిత అభినందించారు.

తన తండ్రి స్వగ్రామమైన హనుమప్ప పల్లిలో ఏర్పాటు చేసిన ఎంజేపీ గురుకుల పాఠశాలకు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్లతో శాశ్వత భవన సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు రూ.12 కోట్లతో శాశ్వత భవనం నిర్మించనున్నట్లు, త్వరలోనే ఈ భవనానికి శంకుస్థాపన జరగనుందని ఆమె పేర్కొన్నారు.

ఎంజేపీ గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ షూట్లు అందజేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. హనుమప్ప పల్లిలో అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, హనుమప్ప పల్లి గ్రామస్థులు, ఎంజేపీ గురుకుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రకటనను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల వారి కార్యాలయం జారీ చేసింది.