రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సార్వభౌమత్వం పట్ల ప్రజల్లో స్ఫూర్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీకి ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా స్పందించారు.
పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం ప్రాంగణం నుంచి తిరంగా ర్యాలీ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వరకు దేశభక్తి నినాదాలతో, జాతీయ జెండాలతో ర్యాలీ కొనసాగింది. మార్గమంతా పాల్గొన్న వారు చేతుల్లో జాతీయ పతాకాలు పట్టుకుని దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ర్యాలీ కారణంగా పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ సువర్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఫైరోజా బేగం, ఐసిడిఎస్ పిడి ప్రమీల, డిఆర్‌డిఎ పిడి నరసయ్య పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పట్టణంలోని పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు, చిన్నారులు కూడా ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. చిన్నారులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ముందుకు సాగడం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీ మార్గంలో స్థానికులు వీధుల వెంట నిలబడి పాల్గొన్న వారిని అభినందించారు.
“హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఎగురవేయాలని, దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలు అర్పించిన వీర సుధలను స్మరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో పుట్టపర్తిలో నిర్వహించిన ఈ ర్యాలీకి అధికార యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. ర్యాలీ ముగిసిన అనంతరం పాల్గొన్న వారికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.













