రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: వెనెజువెలా మరోసారి భూకంప ప్రకంపనలకు గురైంది. ఇప్పటికే జంట భూకంపాలతో వణికిపోయిన ఆ దేశంలో శుక్రవారం మధ్యాహ్నం మళ్లీ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజధాని కారకస్, మరాకే పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనుభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇటీవల సంభవించిన భారీ జంట భూకంపాల దెబ్బతో వెనెజువెలా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. బుధవారం సాయంత్రం కేవలం క్షణాల వ్యవధిలో వరుసగా 7.2, 7.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనలతో వందలాది భవనాలు కూలిపోయాయి. వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి.
ప్రాణాలతో రక్షించేందుకు తొలి 48 నుంచి 72 గంటలు అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ, అధికారిక సహాయం కోసం ఎదురుచూడకుండా స్వయంగా శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
లా గువేరా రాష్ట్రం జంట భూకంపాల ప్రభావానికి అత్యంత తీవ్రంగా గురైంది. ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రెస్క్యూ బృందాలు చేరుకోవడంలో ఆలస్యం జరుగుతుండటంతో బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎనిమిది అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో తన ఐదేళ్ల కుమారుడు, మరికొంతమంది బంధువులు శిథిలాల కింద చిక్కుకుపోయారని జెన్నిఫర్ అనే మహిళ స్థానిక మీడియాతో వాపోయింది. ప్రభుత్వ సహాయం ఆలస్యమవుతుండటంతో స్థానికులే చాలామందిని రక్షించారని, అయితే భారీ కాంక్రీటు స్లాబులు ఎత్తేందుకు క్రేన్లు, భారీ యంత్రాలు అత్యవసరమని ఆమె పేర్కొంది.
ఈ ప్రకృతి విపత్తు వెనెజువెలా చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రత్యక్ష నష్టం 6.7 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.63వేల కోట్ల మేరకు చేరిందని వెల్లడించింది. పరోక్ష ప్రభావాలను లెక్కిస్తే నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐరాస అభిప్రాయపడింది.
ఇప్పటికే రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభంతో వెనెజువెలాలో వ్యవస్థలు బలహీనపడ్డాయి. ఇప్పుడు భూకంపాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారికి తగిన ఆశ్రయం కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్న అనేక మంది కార్లలోనే రాత్రి గడుపుతున్నారు. పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు.
దాదాపు మూడుకోట్ల జనాభా కలిగిన వెనెజువెలాలో సగానికి పైగా ప్రజలు పేదరికంలోనే జీవిస్తున్నారు. భూకంపాలు సంభవించకముందే సుమారు 80 లక్షల మందికి మానవతా సహాయం అత్యవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి. తాజా విపత్తుతో ఆ అవసరం మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.













