నిరుద్యోగ యువతకు ఊరటగా ప్రతి మూడు నెలలకో ఉద్యోగ మేళా

తిరుపతి : నిరుద్యోగం యువతను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. కోర్సులు పూర్తిచేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలు నెరవేర్చే దిశగా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ రాష్ట్ర ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం స్థానికంగా డిమాండ్‌ ఉన్న రంగాలు ఏవి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పన కోసం ఏ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలనే అంశాలపై సంబంధిత శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కంపెనీలతో ముందుగా సంప్రదింపులు జరిపి, వారి అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ మేళాలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ విధంగా నిర్వహించే మేళాల ద్వారా స్థానిక యువతకు తగిన నైపుణ్యాలు, అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు 34 మినీ, 57 మెగా జాబ్‌మేళాలు నిర్వహించారు. వీటిలో మొత్తం 14,576 మంది అభ్యర్థులు పాల్గొనగా, 10,941 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 ఉద్యోగ మేళాలకు 1,267 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 475 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

పదోతరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఈ మేళాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. పలు కంపెనీలు నియామక ప్రక్రియలో ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సంబంధిత వర్గాల్లో వ్యక్తమవుతోంది.

జిల్లాలో ఉద్యోగ మేళాలు పద్ధతిగా, సక్రమంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి జరగనున్న ఈ ఉద్యోగ మేళాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా మరింత ఉపయోగపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.