దేవగుడి గ్రామంలో వై ఏస్ విగ్రహం ధ్వంసం - వైసిపీ నిరసన ర్యాలీ

జమ్మలమడుగు రూరల్ మండలం దేవగుడి గ్రామంలో మహానేత వైయస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA ఆదినారాయణ రెడ్డి, అబ్బాయ్ భూపేష్ రెడ్డి ఆదేశాల మేరకు విగ్రహాన్ని మూడు ముక్కలుగా పగలగొట్టినట్లు స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.

విగ్రహ ధ్వంసం ఘటనపై నిరసనగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. MP అవినాష్ రెడ్డి, MLC రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకుల సమక్షంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. ర్యాలీకి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు.

జమ్మలమడుగు పట్టణంలో ప్రారంభమైన ర్యాలీ, నినాదాలతో ముందుకు సాగింది. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మహానేతకు జోహార్ YSR అంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది.

పోలీస్ స్టేషన్ వద్ద MP అవినాష్ రెడ్డి, MLC రామసుబ్బారెడ్డి, స్థానిక MLAలు, జిల్లా మాజి MLAలు, జిల్లా నాయకులు పోలీస్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. YSR విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీస్ శాఖను కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో ప్రొద్దటూరు మాజి MLA రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, బద్వేల్ MLA Dr సుధా, మాజి మంత్రివర్యులు అంజాద్ బాషా, నియోజకవర్గ పరిశీలకులు పోరెడ్డి నరసింహ రెడ్డి, SEC మెంబెర్ గిరిధర్ పాల్గొన్నారు. నాయకులు సంఘటనా స్థలాన్ని కూడా సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు.

ర్యాలీ మొత్తం సమయంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, విగ్రహ ధ్వంసం ఘటనను ఖండించారు. మహానేత వైయస్ స్ఫూర్తితో ప్రజాసేవ కొనసాగుతుందని, విగ్రహాల ధ్వంసం ద్వారా ప్రజల మనసుల్లో ఉన్న గౌరవాన్ని ఎవరూ చెరపలేరని నాయకులు పేర్కొన్నారు.

విగ్రహ ధ్వంసం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ, అప్రమత్తంగా చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలియజేశాయి.