జమ్మలమడుగులో రేపు మళ్లీ హడావుడి. టెంట్లు లేచాయి. తోరణాలు కట్టారు. వేదిక ముస్తాబైంది. ఊరి జనం మాత్రం పెదవి విరుస్తున్నారు — "ఈ హడావుడి అంతా మళ్లీ కాయ కొట్టడానికేనా?" అని. అవును మరి. పంతొమ్మిదేళ్లలో ఇది ఐదో టెంకాయ! మా సీమలో వానలు మొహం చాటేస్తాయి కానీ, ఎన్నికలు దగ్గరపడితే చాలు — శంకుస్థాపనలు మాత్రం ఠంచనుగా వచ్చి వాలతాయి. పంతొమ్మిదేళ్లు. ముగ్గురు ముఖ్యమంత్రులు. ఐదు శిలాఫలకాలు. వచ్చిన ఉక్కు — సున్నా. ఆ ఊరి పేరే సున్నపురాళ్లపల్లె. పేరుకు తగ్గట్టే పాలకులు రాళ్లు మిగిల్చారు, సున్నా చూపించారు! రేపు (జులై 3న) చంద్రబాబు రూ.8,800 కోట్ల లెక్కలు, 3,500 ఎకరాల మాటలు, "2028 నాటికి పూర్తి" అనే కొత్త హామీ పట్టుకుని ఐదో కాయ పగలగొడతారు. కాయ పగులుతుంది సరే — మా తలరాత ఎప్పుడు మారుతుంది?

బ్రాహ్మణి బండారం — భూములు గాలికి, సొమ్ములు గాలి జనార్దన్ రెడ్డికి!

'పెద్దాయన' అని సీమ జనం ఇప్పటికీ గుండెల మీద చెయ్యేసుకుని తలుచుకుంటారు. తలుచుకోండి — అభ్యంతరం లేదు. కానీ లెక్క మాత్రం అడగండి. 2007లో జమ్మలమడుగులో తొలి టెంకాయ కొట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డే. ఎవరి కోసం? బళ్లారి గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి 'బ్రాహ్మణి స్టీల్స్' కోసం! రూ.4,430 కోట్ల పెట్టుబడి, ఏటా 20 లక్షల టన్నులు, 2017 నాటికి కోటి టన్నులు — అంకెలు ఆకాశాన్ని తాకాయి. ఆచరణ? అడుగు దాటలేదు. ఆ సంస్థకు 10,670 ఎకరాల ప్రభుత్వ భూమి — ఎకరాకు పద్దెనిమిదిన్నర వేలు! ఒక పాత మోటార్‌సైకిల్ ధరకు ఎకరం పొలం. దీన్ని దానం అనాలా, దోపిడీ అనాలా?

శంకుస్థాపన మంగళవాయిద్యాల చప్పుడు ఆగకముందే ఆ భూములు తాకట్టుకెక్కాయి — రూ.350 కోట్ల రుణాలు లేచాయి. మారిషస్ డొంకల్లో షెల్ కంపెనీల షేర్ల గారడీ నడిచింది. ఓబులాపురం గనుల ముసుగులో ఖనిజం ఓడలెక్కింది. ఇది మేం అల్లిన కథ కాదు — విమానాశ్రయం పేరుతో మరో 1,261 హెక్టార్లు నిబంధనలు తుంగలో తొక్కి కట్టబెట్టారని కాగ్ నివేదికే కుండబద్దలు కొట్టింది. బ్రాహ్మణికి దోచిపెట్టిన అనుగ్రహాలకు ప్రతిఫలం జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా తిరిగొచ్చిందని సీబీఐ ఎఫ్ఐఆర్ 'క్విడ్ ప్రో కో' అని రాసింది. గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లారు. నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి అరెస్టయ్యారు. 2012లో ఎంఓయూ రద్దయింది. చివరి ట్విస్టు వినండి — ఉక్కు పోయకుండానే బ్రాహ్మణి అమ్ముడుపోయింది! కడప కల 'ఉత్తమ్ గల్వా ఫెర్రస్' అనే కొత్త పేరుతో పరాయి పంచన చేరింది. కంచే చేను మేసింది. కాపలాదారుడే కళ్లం ఎత్తుకెళ్లాడు. ఉక్కన్నారు — ఊడ్చుకెళ్లారు!

కాయ నీదా? కాయ నాదా? — పగిలింది మాత్రం సీమ తలకాయ!

బాబుగారూ! 2018లో కంబాలదిన్నెలో మీరు కొట్టిన కాయ గుర్తుందా? 2019 ఓట్ల కోసం కొట్టారు — ఓట్లు రాలేదు, కాయా మిగల్లేదు. జగనన్నా! అధికారంలోకి రాగానే "బాబు రాయి నాకొద్దు" అని స్థలమే మార్చేసి 2019 డిసెంబర్ 26న సొంత కాయ కొట్టారు. ఆ రోజు మీ నోటి మాట మీడియా రికార్డుల్లో పదిలంగా ఉంది — "మూడేళ్లలో ప్లాంటు కడతా, 20 వేల మందికి ఉద్యోగాలిస్తా!" మూడేళ్లు తిరిగాయి. ఇచ్చిందేమిటి? ఉద్యోగాలు కాదు — 2024 ఎన్నికల ముందు, 2023 ఫిబ్రవరిలో జిందాల్‌ను పక్కన నిలబెట్టుకుని అదే ప్లాంటుకు మరో టెంకాయ! ఒకే ప్లాంటుకు ఒకే నాయకుడు రెండు శంకుస్థాపనలు — ఈ ఘనతకు గిన్నిస్ బుక్ వాళ్లకు ఉత్తరం రాయాల్సిందే!

ఇప్పుడు మళ్లీ బాబుగారి వంతు. జిందాల్ ప్రాజెక్టుకు క్రెడిట్ కిరీటం తనకే కావాలన్న ఆత్రంతో ఐదో కాయకు ముహూర్తం. "ఆ కాయ పాతది — నా కాయే పండింది" అన్న పోటీలో ఇద్దరూ మునిగారు. లెక్క చూడండి: 2018 రాయి 2019 ఓట్ల కోసం. 2023 రాయి 2024 ఓట్ల కోసం. 2026 రాయి — '2028కి పూర్తి' హామీతో — 2029 ఓట్ల కోసం! శిలాఫలకాల క్యాలెండరూ, ఎన్నికల క్యాలెండరూ ఒకటేనని గుర్తించలేనంత అమాయకులా సీమ జనం? టెంకాయ చెట్టుకు కాస్తుంది. మీకు మాత్రం ఎన్నికలకు కాస్తుంది!

ఢిల్లీలో దగా — గల్లీలో దందా!

ఇక ఢిల్లీ పెద్దల ఘనత. 2014 విభజన చట్టంలో కడప ఉక్కు గురించి రాసిందేమిటో ఒక్కసారి చదవండి — "కడతాం" అని కాదయ్యా! "సెయిల్ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుంది" అని! హామీ ఇస్తూనే తప్పించుకునే కిటికీ తెరిచి పెట్టుకున్న ఘటికులు వీళ్లు. ఆ కిటికీని 2023 జులై 25న బార్లా తెరిచేశారు — కడపలో ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం "సాంకేతికంగా, ఆర్థికంగా లాభసాటి కాదు" అని లోక్‌సభ సాక్షిగా కేంద్ర మంత్రే సెలవిచ్చారు. మరి లాభసాటి కానిదానికి ఈ కాయల మీద కాయలు ఎందుకు? ఢిల్లీది అబద్ధమా? గల్లీది నటనా? ఏది నిజమైనా నలిగేది కడప బిడ్డడే. విశాఖ ఉక్కు — ఆంధ్రుల హక్కు అని కోస్తా గర్జిస్తే అక్కడ ఫ్యాక్టరీ లేచింది. కడప ఉక్కు అని సీమ గొంతెత్తితే ఇక్కడ లాఠీలు లేచాయి. కోస్తాకు కర్మాగారం — సీమకు కొబ్బరి చిప్పలు!

ఈ పంతొమ్మిదేళ్ల నాటకంలో హీరోలు మారారు కానీ, ప్రతి సీన్‌లో కనిపించే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రం మారలేదు — ఆదినారాయణ రెడ్డి! తొలి కాయ పడ్డప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. తర్వాత వైసీపీ కండువా. ఆపై టీడీపీలో మంత్రి కుర్చీ. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఐదో కాయకు పీటలు వేస్తున్నదీ ఆయనే! జెండాలు నాలుగు మారాయి — అజెండా మాత్రం ఒక్కటే: ఏ కాయ పగిలినా కొబ్బరి ముక్క తన జేబులోనే పడాలి! ప్లాంటు రాదు కానీ ప్లాంటు 'పేరు' మాత్రం ఏటా పండుతుంది — ప్రహారీ గోడల కాంట్రాక్టులు, మట్టి చదును పనులు, చుట్టుపక్కల భూదందాలు... ఫ్యాక్టరీ పొగ రాకముందే ఖద్దరు జేబులు నిండాయని ఆ ఊరి జనమే వాపోతున్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు — ఎవరు ఏమన్నా వీళ్లకు చీమకుట్టినట్టైనా లేదు!

కొట్టేది కాయలు — మిగిలేది చిప్పలు!

ఈ పందొమ్మిదేళ్లలో ప్లాంటు కోసం ప్రాణమిస్తామన్న నేతలకు దక్కింది పదవులు, కాంట్రాక్టులు. నిజంగా వీధికెక్కి పోరాడిన యువతకు దక్కింది లాఠీ దెబ్బలు, కేసులు. కడపలో పుట్టిన ప్రతి బిడ్డా బెంగళూరు బస్సో, గల్ఫ్ విమానమో ఎక్కుతున్నాడు. నాయకుడు మాత్రం అదే నేల మీద మళ్లీ కాయ కొడుతున్నాడు!

అందుకే రేపటి వేదిక మీద నిలబడే పెద్దలకు సీమ తరఫున మా సూటి ప్రశ్నలు — తొలి పిల్లర్ లేచే తేదీ చెప్పగలరా? జిందాల్ ఒప్పందంలో నిర్మాణ గడువులేమిటి? స్థానిక యువతకు ఉద్యోగాల రాతపూర్వక హామీ ఏది? "లాభసాటి కాదు" అన్న లోక్‌సభ ప్రకటనపై కేంద్రం తాజా జవాబేమిటి? ఈ నాలుగింటికి జవాబు లేని నాడు — ఇది శంకుస్థాపన కాదు, షూటింగ్! టెంకాయ దేవుడికి కొడితే మొక్కు. ఓటరుకు కొడితే మోసం! ఇకపై సీమ జనం చప్పట్లు కొట్టరు — లెక్కలు అడుగుతారు. సున్నపురాళ్లపల్లె నేల గొంతు విప్పి చెబుతోంది: "నా గుండెల మీద ఆరో రాయికి చోటు లేదు — ఇక లేచేది పిల్లరో, లేకుంటే ప్రజాగ్రహమో!"


జి. శ్రీనివాస రెడ్డి

రాయలసీమ న్యూస్