వై ఎస్ ఆర్ కడప : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందుతున్న అర్జీలను అత్యంత బాధ్యతాయుతంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవన్ సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్వో మల్లికార్జునుడు హాజరై ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడి ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవిన్యూ క్లినిక్ ల ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. PGRS లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో, సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని డిఆర్వో తెలిపారు. జిల్లా అధికారులకు అందిన అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించి, వాటిపై సమీక్ష నిర్వహించాలని ఆయన సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఈ సందర్భంగా ప్రజల నుండి పలు విజ్ఞప్తులు అందాయి. సింహాద్రిపురంకు చెందిన మహమ్మద్ కలాం తన తండ్రి RTC లో డ్రైవర్‌గా పనిచేస్తూ అకాల మృతి చెందాడని, కారుణ్య నియామకం ద్వారా తనకు ఉద్యోగం కల్పించాలంటూ PGRS లో వినతిపత్రం సమర్పించారు.

సిద్దవటం మండలం ఎగువపల్లెకు చెందిన వెంకట సుబ్బమ్మ ప్రభుత్వ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ లో చాలా ఏళ్లుగా స్వీపర్‌గా పనిచేస్తున్నానని, ప్రస్తుతం తక్కువ పారితోషికం కారణంగా కుటుంబ పోషణ కష్టంగా ఉందని, ప్రభుత్వం నుండి జీతం అందే విధంగా సదుపాయం కల్పించాలని అర్జీ ద్వారా విన్నవించారు.

సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామానికి చెందిన శివ తులసమ్మ తన భర్త మరణించినప్పటి నుండి తన కూతుర్లు ఆస్తి కోసం తనను హింసిస్తున్నారని, ఇల్లు ఆక్రమించుకున్నారని న్యాయం చేయాలంటూ అర్జీ సమర్పించారు.

పులివెందుల మండలం బయమ్మతోటకు చెందిన సుబ్బారాయుడు తన ఇంటి పక్కవారు తన స్థలంలోని జాగను ఆక్రమిస్తున్నారని, కొలతలు వేయాలని చాలాసార్లు అర్జీ పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని PGRS లో వినతిపత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో ZPP CEO సుబ్రమణ్యం, SSA APC అనురాధ, SDC వెంకట పతి, రంగస్వామి, శాంతమ్మతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.