రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జూలై 3వ తేదీ శుక్రవారం వై ఎస్ ఆర్ కడప జిల్లాకు ఒకరోజు పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పర్యటన కార్యక్రమ వివరాలను వెల్లడిస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఉన్న JSW ARSL ప్లాంట్ సైట్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారని పేర్కొన్నారు.

అనంతరం ఉదయం 10.40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి, ఉదయం 10.45 గంటలకు కన్య తీర్థం వద్ద ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకుంటారని, అక్కడి నుంచి తిరిగి ఉదయం 10.55 గంటలకు స్టీల్ ప్లాంట్‌కు చేరుకుంటారని ఆయన వివరించారు.

తరువాత ఉదయం 11.05 గంటలకు JSW ARSL హెవీ సెక్షన్ మిల్ కాంక్రీటు ఫ్లోరింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటల నుండి మధ్యాహ్నం 1.35 గంటల వరకు JSW ARSL ప్లాంట్ సైట్‌ను ముఖ్యమంత్రి సందర్శించనున్నారని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్శనలో భాగంగా ఎక్స్పీరియన్స్ జోన్‌ను పరిశీలించడంతో పాటు JSW రాయలసీమ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శిలాఫలకం ఆవిష్కరణ చేయనున్నారు. అలాగే 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ , ఇండస్ట్రియల్ పార్క్ లకు సంబంధించిన శిలాఫలకాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారని ఆయన పేర్కొన్నారు.

జిల్లా పర్యటనను ముగించుకుని మధ్యాహ్నం 2.10 గంటలకు JSW ARSL ప్లాంట్ సైట్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి కుప్పం కు వెళ్లనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆ ప్రకటనలో తెలిపారు.