రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండటంతో, కంప్యూటర్ ఆధారిత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) పరీక్షల నుంచి వారిని మినహాయించాలని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం ప్రొద్దుటూరులోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న కంప్యూటర్ ఆధారిత టెట్ విధానం సీనియర్ టీచర్లకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు కంప్యూటర్ వినియోగంలో నైపుణ్యం లేకపోవడంతో, వారికి ఈ విధానం భారంగా మారుతుందని పేర్కొన్నారు.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ బోధన అనుభవం, సేవా కాలం ఆధారంగా అర్హతను నిరూపించుకున్నారని, వారికి మళ్లీ టెట్ విధించడం అవసరం లేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టెట్ ను తప్పనిసరి చేస్తే, అది కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో కాకుండా రాత పరీక్షల ద్వారానే నిర్వహించాలన్నారు. రాత పరీక్షల ద్వారా నిర్వహిస్తే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేని సీనియర్ టీచర్లు కూడా సులభంగా పరీక్ష రాయగలరని ఆయన సూచించారు.
ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, టెట్ విధానంలో మార్పులు చేయాలని, ముఖ్యంగా సీనియర్ మరియు ఇన్ సర్వీస్ టీచర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని APTF వర్గాలు భావిస్తున్నాయని ఆయన తెలిపారు.













