రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఆర్థిక ఇబ్బందులు, బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు మహిళలు ఇప్పుడు స్వదేశానికి చేరుకుంటామో లేదో అన్న భయంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందిన శిరోమణి, పద్మ అనే మహిళలు కొన్ని నెలల క్రితం మస్కట్ ప్రాంతానికి గల్ఫ్ ఏజెంట్ల ద్వారా వెళ్లారు. మంచి జీతం వస్తుందని, కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశతో విదేశాలకు అడుగుపెట్టిన వీరు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మస్కట్‌లోని అరబ్ షేక్‌ల ఇళ్లలో పనిచేస్తున్న ఈ ఇద్దరు మహిళలు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రొద్దుటూరు కు చెందిన శిరోమణి కడుపు నొప్పితో, ఉయ్యూరు కు చెందిన పద్మ గుండె సమస్యలతో తల్లడిల్లుతున్నారు. పరిస్థితులు విషమించడంతో అక్కడి అరబ్ షేక్‌ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారు. అయితే వారి పాస్పోర్ట్‌లు మాత్రం ఇంకా అరబ్ షేక్‌ల వద్దే ఉండిపోయాయి.
శిరోమణి స్వదేశానికి రావడానికి కుటుంబ సభ్యులు ఇప్పటికే విమాన చార్జీలు పంపించినప్పటికీ, మరో రెండు లక్షలు ఇస్తే తప్ప పంపేది లేదని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో, ఇండియాకు చేరుకుంటామో లేదో అన్న భయంతో ఈ ఇద్దరు మహిళలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
“ప్లీస్.. మమ్మల్ని ఇండియాకు రప్పించండి… ప్రాణాలతో బిడ్డలను చూసుకోనివ్వండి”
స్వదేశానికి చేరుకుని, ప్రాణాలతో కుటుంబ సభ్యులను, పిల్లలను చూసుకోవాలని వీరి ఆర్తనాదం హృదయ విదారకం గా మారింది. గల్ఫ్ ఏజెంట్ల మాటలు నమ్మి విదేశాలకు వెళ్లిన తమ పరిస్థితిని గుర్తించి, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా సంబంధిత అధికారులను వేడుకుంటూ, తమను ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ ఇద్దరు మహిళలు కోరుతున్నారు. పాస్పోర్ట్‌లు అరబ్ షేక్‌ల వద్ద ఉండటం, అదనపు డబ్బు డిమాండ్ వంటి అంశాలపై ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఇండియన్ ఎంబసీ తక్షణం స్పందించాలని కుటుంబ సభ్యులు కూడా ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
గల్ఫ్ ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్లే మహిళల భద్రత, గల్ఫ్ ఏజెంట్ల అక్రమ కార్యకలాపాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ప్రొద్దుటూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందిన శిరోమణి, పద్మ సమస్యపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.













