రాయలసీమ న్యూస్, అనంతపురం:
ప్రభుత్వ బడులు, వసతి గృహాల్లో మౌలిక వసతుల లోపం సహించం: కలెక్టర్ ఆనంద్ హెచ్చరిక
అనంతపురం:- ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో సంక్షేమం, విద్య, ఎస్‌ఎస్‌ఏ తదితర శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ సంక్షేమ శాఖ అధికారుల పని తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధనలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. త్రైమాసిక ఫలితాల్లో వెనకబడిన సందర్భంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థులకు ఆహ్లాదకరమైన, చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించడం తమ బాధ్యత అని కలెక్టర్ గుర్తుచేశారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత, భద్రత, పౌష్టికాహారం వంటి అంశాలపై ఎలాంటి లోటు, సమస్యలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని అధికారులను అప్రమత్తం చేశారు.
సీజనల్‌గా ప్రబలే వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య శాఖతో సమన్వయం పెంచాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
గురుకులాలు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అర్హులైన విద్యార్థులు అవకాశం కోల్పోకుండా జాబితాలను పునఃసమీక్షించి, ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమాధికారి శ్రీనివాసరావు, బీసీ డీడీ కుష్బూ కొఠారి, మైనార్టీ అధికారి రామసుబ్బారెడ్డి, డ్వామా పీడీ సలీం, ఎస్‌ఎస్‌ఏ శైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముద, దివ్యాంగుల సంక్షేమాధికారి అర్చన, ఎంఐ ఎస్‌ఈ విశ్వనాథ్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.













