అనంతపురం ఆసుపత్రి ఘటనపై విచారణ

: ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్‌చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు పెట్టిన ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బాధ్యతగల అధికారులపై తగిన చర్యలు తీసుకునేలా ఇప్పటికే సూచనలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.

ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన బాధాకరమని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై డీ ఎం ఈ ద్వారా సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సత్యకుమార్ ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసర ప్రాంతంలో కొంతమంది యూట్యూబ్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ, ఆసుపత్రి నిర్వహణ అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఇలాంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

వైద్య సేవల అంశంతో పాటు మంత్రి సత్యకుమార్ రాజకీయ పరిణామాలపై కూడా స్పందించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేర్ని నాని వంటి నాయకుల రాజకీయ ధోరణిపై కూడా వ్యాఖ్యలు చేశారు.

పేర్ని నాని లాంటి వాళ్లు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు. ఆయన అవకాశం కోసం పార్టీలు మారే వ్యక్తి, నేను కాదు. నా రక్తంలోనే బీజేపీ ఉంది. రక్తంలోనే బీజేపీ, కషాయం రంగు ఉన్నాయి. నేను సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాడిని, అవకాశవాదిని కాదు.

ఒక మంత్రిగా చెబుతున్నా... కూటమి ప్రభుత్వంపై ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోను. నేను సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిని.

నేను జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదు. కేవలం ఆయనకున్న వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతాను. జగన్ ఒక నిలకడ లేని మనిషి.

రాజధాని అమరావతి పనులు తొందర్లోనే పూర్తి అవుతాయి. క్యాపిటల్ పై జగన్ మాట్లాడుతుంటే ఆయనకు అవగాహన లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చేతనైతే జగన్‌ను తన మాటపై నిలబడి ఎన్నికలకు వెళ్ళమనండి, అప్పుడు చూద్దాం.

గత ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల వైద్య సేవల్లో మార్పు రావాల్సి ఉంది. దానికోసం నిరంతరం కృషి చేస్తున్నాం.

ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఒక్క ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం.

అనంతపురం ఆసుపత్రి వీల్‌చైర్ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గంభీరంగా తీసుకున్నట్లు మంత్రి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. వైద్య సేవల మెరుగుదలతో పాటు తప్పుడు ప్రచారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆయన సూచించారు.