అనంతపురం జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తెలిపారు. ప్రజలకు ఎదురవుతున్న వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోరే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మంగళవారం అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద 24న జరగనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్లను సాకే హరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్నాను విజయవంతం చేయాలని, విస్తృత స్థాయిలో ప్రజలు, సంఘాలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో సంబంధిత శాఖలు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని సాకే హరి హెచ్చరించారు. ప్రజల హక్కుల సాధన కోసం ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ పోరాటం కొనసాగిస్తుందని, సమస్యలు పరిష్కరించే వరకు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.