రాయలసీమ న్యూస్, అనంతపురం: జూనియర్ న్యాయవాది గౌతంరాజుపై రూరల్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ అనుచిత ప్రవర్తన చేశారంటూ న్యాయవాదులు శుక్రవారం గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. సీఐపై చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ధర్నా కారణంగా స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనలో పాల్గొన్న న్యాయవాదులు ద్విచక్ర వాహనాలను రోడ్డుపై అడ్డుపెట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రోడ్డుపైనే భోజనాలు చేస్తూ నిరసన కొనసాగించారు. సీఐ తమకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయనకు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. ఈ ధర్నాలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు రాజారెడ్డి, శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. న్యాయవాది గౌతంరాజు గురువారం సాయంత్రం కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా, నరిగమ్మ ఆలయం వద్ద సీఐ శ్రీకాంత్ వాహనం ఆపి పత్రాలు అడిగారని తెలిపారు. ఇంటి వద్ద తన తండ్రి ఆరోగ్యం బాగలేదని, త్వరగా వెళ్లేలా పంపించాలని గౌతంరాజు కోరగా, సీఐ, సిబ్బంది దుర్భాషలాడుతూ దాడి చేశారని వారు ఆరోపించారు.
అంతటితో ఆగకుండా గౌతంరాజును జీపులో స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టారన్నారు. తప్పు చేస్తే కేసు నమోదు చేయాలి కానీ, ఇష్టారాజ్యంగా దాడి చేయడం ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది.
నరిగమ్మ ఆలయం వద్ద న్యాయవాది గౌతంరాజును సీఐ శ్రీకాంత్ కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని ఎస్పీ కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వాహనాల తనిఖీలు నిర్వహించే క్రమంలో న్యాయవాది బండిని ఆపి, వాహన పత్రాలను చూపించాలని కోరగా, సదరు న్యాయవాది పోలీస్ సిబ్బందిని లేనిపోని మాటలతో దూషించాడని ఎస్పీ కార్యాలయం పేర్కొంది. ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా విధుల్లో ఉన్న సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకం కలిగించి, పోలీసులపై బూతుపురాణం మొదలెట్టాడని వివరణలో తెలిపింది.
ఈ సందర్భంలో ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో సీఐ శ్రీకాంత్ చెయ్యి కొరికి గాయపరిచాడని, అనంతరం పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశాడని ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. స్టేషన్‌లో గోడలకు తల బాదుకుని, పెన్నుతో శరీరంపై పొడుచుకుని వీరంగం సృష్టించినప్పటికీ, పోలీసులు ఓర్పుగా అతన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఫ్యాక్ట్ చెక్ ప్రకటనలో పేర్కొన్నారు.
న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో ఎస్పీ జగదీశ్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కోసం అనంతపురం అర్బన్ డీఎస్పీ చంద్రశేఖర్‌ను నియమించినట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు అడ్వకేట్లు చేసిన ధర్నా కొనసాగింది. చివర్లో అనంతపురం రూరల్ స్టేషన్ సీఐ గౌతంరాజు అడ్వకేట్ అని తెలియక ఈ చర్యలు చేశానని, తనవద్ద తప్పు జరిగిందని చెప్పి క్షమాపణ కోరినట్లు న్యాయవాదులు తెలిపారు.













