అనంతపురం టౌన్ ఎన్జీవో ప్రాంగణంలో ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాయలసీమ రాష్ట్ర సమితి ప్రకటించింది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్ జిల్లాలను కలిపి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, రాయలసీమ ప్రజలందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.

రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు డా. కుంచం వెంకట సుబ్బారెడ్డి ఈ ప్లీనరీలో రాయలసీమకు రావలసిన హక్కులు, అవసరాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. తరతరాలుగా రాయలసీమపై జరుగుతున్న అన్యాయాలను దేశం ముందుంచేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

“సీమ సాధన కోసం పిడికిలి బిగిద్దాం. తరతరాల రాయలసీమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను చాటేందుకు తరలిరండి. ఈ ప్లీనరీ సమావేశాలలో సీమకు రావలసిన, కావాల్సిన అనేక విషయాలను చర్చించుకుందాం. సీమ సింహాలను నిద్రలేపి ఒక ఉప్పెన రూపంగా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ సీమ ప్రజా ప్రతినిధులకు బుద్ధి చెప్పాల్సిన వేదిక ఇదే. సీమ బిడ్డలమైన మనం అందరం పాల్గొని మన భావితరాల జీవితాలను బంగారుమయం చేసుకోవడానికి, మన ప్రాంతాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడానికి రండి ఉద్యమించండి, ఈ ప్లీనరీలో పాల్గొని చర్చించుకుందాం” అని డా. కుంచం వెంకట సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

పార్లమెంట్ లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా, అఖిలపక్ష సమావేశాలు ఎప్పుడు జరిగినా, రాయలసీమను కేంద్రపాలిత ప్రాంతంగా 2029 సంవత్సరము ముగిసేలోపు ఏర్పాటు చేయాలా, లేక 1951లో మద్రాసు రాష్ట్రంలో ఉన్నట్లుగానే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్ జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ ప్రాంతంగా ఆమోదించే తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలా అనే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు.

ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం కార్యాచరణ ప్రణాళిక, పార్లమెంటులో ఆర్టికల్ 3 కింద ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టే విషయంపై కూడా చర్చ జరగనుంది. రాయలసీమ ప్రజల ఆకాంక్షలైన ప్రత్యేక రాయలసీమను రాజ్యాంగబద్ధంగా ఎలా సాధించాలన్న దానిపై మేధోమథనం చేయాలని సమితి భావిస్తోంది.

సీమ సంస్కృతి, సాంప్రదాయాలకు చెందిన ఉత్సవాలు, జాతరలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలన్న డిమాండ్‌పై, స్వాతంత్ర్యోద్యమ నాయకుల జయంతులు, వర్ధంతులను అధికారికంగా జరపడం, వారి స్మారకాలను ప్రభుత్వం అభివృద్ధి చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు.

సీమ దళిత బంధు, రైతు బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు కేటాయించే ప్రతిపాదన, తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో స్థాపించడం, రాయలసీమ విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధులు రాబట్టడం వంటి అంశాలు కూడా కార్యాచరణలో భాగంగా ఉన్నాయి.

తిరుపతి తిరుమల దేవస్థానంలో రాయలసీమ యువతీ యువకులకు ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దేవస్థాన నిధుల్లో భాగాన్ని రాయలసీమ అభివృద్ధికి కేటాయించడం, రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసి, వారి ధాన్యాన్ని నేరుగా అమ్ముకునే విధానాన్ని అమలు చేయడం వంటి విషయాలపై చర్చించనున్నారు.

రాయలసీమలోని అన్ని పరిశ్రమల్లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించడం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయించే మార్గాలపై చర్చ జరగనుంది. రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఒక సాఫ్ట్వేర్ కారిడార్ ఏర్పాటు, CPS రద్దు, రాయలసీమకు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, గుంతకట్లు రైల్వే జోన్‌గా ప్రకటించడం, రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామిక కారిడార్‌లుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలను కూడా ప్లీనరీలో ప్రస్తావించనున్నారు.

ఈ చర్యల ద్వారా వెనుకబడిన రాయలసీమ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, భూముల విలువలు కూడా పెరుగుతాయని సమితి నేతలు భావిస్తున్నారు.