రాయలసీమ న్యూస్, అనంతపురం:
వృద్ధురాలి హత్య.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
కళ్యాణదుర్గం పట్టణం వడ్డె కాలనీలో మంగళవారం జరిగిన దారుణ హత్యా సంఘటన స్థానికులను కలవరపరిచింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో కర్కశంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం వడ్డె కాలనీలో నివసిస్తున్న లక్ష్మీదేవి (74) తన కుమారుడు శ్రీరాములు, కోడలు లక్ష్మీదేవి కూలి పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. మనవరాలు మహాలక్ష్మి పాఠశాలకు వెళ్లగా, పెద్ద మనమరాలు శ్రావణి ప్రతి రోజూ మధ్యాహ్నం సమయానికి దగ్గర్లోని అత్తింటి నుంచి వచ్చి చూసి వెళ్లే అలవాటు ఉండేది.
మంగళవారం కూడా శ్రావణి మధ్యాహ్నం ఇంటికి వచ్చి లక్ష్మీదేవికి భోజనం పెట్టి తిరిగి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం పాఠశాల నుంచి చిన్న మనవరాలు మహాలక్ష్మి ఇంటికి వచ్చినప్పుడు, వృద్ధురాలు మెడపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉండటాన్ని చూసి భయంతో గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న పొరుగువారు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు.
వారి ద్వారా సమాచారం అందుకున్న కుమారుడు శ్రీరాములు, కోడలు లక్ష్మీదేవి ఇంటికి చేరుకుని పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వృద్ధురాలి మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. ఇంట్లో చోటుచేసుకున్న పెనుగులాటకు సంబంధించిన గుర్తులు కూడా కనిపించాయని వారు పేర్కొన్నారు.
దుండగులు వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవికమ్మలు, ముక్కెరతో సహా సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానవత్వాన్ని మంటగలిపే ఈ హృదయ విదారక సంఘటన వడ్డె కాలనీలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఒంటరిగా ఉన్న వృద్ధులు, మహిళల భద్రతపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సమాచారం అందుకున్న సీఐ హరినాథ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లోని పరిస్థితులు, వృద్ధురాలి గాయాలు, దుండగులు ప్రవేశించిన మార్గం వంటి అంశాలను ఆయన పరిశీలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
దుండగులు వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసి, పట్టపగలు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో వడ్డె కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.













