రాయలసీమ న్యూస్, అనంతపురం:
కనేకల్లు రైల్వే వంతెన పనులు వేగవంతం చేయాలి: కేంద్ర సహాయ మంత్రి సోమన్నకు విజ్ఞప్తి
రాయదుర్గం పట్టణంలోని కనేకల్లు రహదారిపై గత ఏడేళ్లుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కోరినట్లు సంబంధిత నాయకులు తెలిపారు. ఢిల్లీలోని రైల్ భవన్ లో బుధవారం మంత్రి కార్యాలయంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి కలిసి కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.
రాయదుర్గం పట్టణ పరిధిలోని కనేకల్లు–అనంతపురం ప్రధాన రహదారులపై చేపట్టిన రైల్వే వంతెన నిర్మాణ పనులు గత ఏడేళ్లుగా నిలిచిపోయిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తాము మంత్రిగా ఉన్న సమయంలో రాయదుర్గం నుంచి అనంతపురం, కనేకల్లు మార్గాల్లో రెండు రైల్వే వంతెనల నిర్మాణ పనులను ప్రారంభించిన విషయాన్ని సోమన్నకు వివరించినట్లు చెప్పారు.
అనంతరం వివిధ కారణాలతో పనులు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. అనంతపురం రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులను పూర్తి చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా (NHAI) అంగీకరించి రూ.46 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని కూడా వివరించినట్లు తెలిపారు.
కనేకల్లు రోడ్డులోని రైల్వే వంతెన నిర్మాణాన్ని రైల్వే శాఖ ఆధ్వర్యంలోనే పూర్తి చేయాల్సి ఉందని సోమన్న దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ముఖ్యంగా బళ్లారి – చిక్ జాజుర్ రైల్వే మార్గం డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కనేకల్లు రహదారిపై ఉన్న రైల్వే వంతెన నిర్మాణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని వివరించినట్లు పేర్కొన్నారు.
డబ్లింగ్ పనులు పూర్తయిన తర్వాత రాయదుర్గం– తుమకూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు, రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అంతకంటే ముందే కనేకల్లు రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
తమ విజ్ఞప్తిపై కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు. వెంటనే రైల్వే బోర్డు సభ్యులతో పాటు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
కనేకల్లు రైల్వే వంతెన నిర్మాణాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి ఈ సానుకూల స్పందనతో గత ఏడేళ్లుగా నిలిచిపోయిన కనేకల్లు రైల్వే వంతెన నిర్మాణ పనులకు త్వరలోనే కదలిక వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రాయదుర్గం పట్టణ ప్రజల రాకపోకలకు మెరుగైన సౌకర్యం కలగడంతో పాటు, భవిష్యత్‌లో పెరగనున్న రైల్వే రద్దీకి అనుగుణంగా రహదారి రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు.













