ఉరవకొండ : దేశంలోని 19 రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీనియర్ జర్నలిస్టులకు తక్షణమే గౌరవప్రదమైన పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వెటరన్ జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వెటరన్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం నగరంలోని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

ధర్నా అనంతరం తమ డిమాండ్లను వివరించిన వినతిపత్రాన్ని సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలకొండయ్యకు జర్నలిస్టులు అందజేశారు. సీనియర్ జర్నలిస్టుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ జీవితాలను అంకితం చేసి, ప్రజలకు నిరంతరం సమాచారాన్ని అందించిన సీనియర్ పాత్రికేయుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. వయసు మీదపడిన జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక పెన్షన్ పథకం అమలు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.

దేశంలోని 19 రాష్ట్రాల్లో ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వెంటనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సేవలను గుర్తించి, వృద్ధాప్యంలో వారికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.

సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సమాచార శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అలసత్వం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని వారు వ్యాఖ్యానించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, ఇప్పటికైనా స్పందించి వెంటనే జీవో విడుదల చేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నాలో వెటరన్ జర్నలిస్టులు, సీనియర్ పాత్రికేయులు, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను.

అనంతరం వినతిపత్రాన్ని స్వీకరించిన సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలకొండయ్య పై విధంగా హామీ ఇచ్చినట్లు పాల్గొన్న జర్నలిస్టులు తెలిపారు.