రాయచోటి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి ప్రభుత్వ బాధ్యతగా భావించి, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కోరారు. సామాన్యుడు, పేద, మధ్యతరగతి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చిందని ఆయన గుర్తుచేశారు.

పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తు మాత్రమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడిగా మారుతుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసించారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కోట్లాది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నాయని, ఆ కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం నిరుపేద స్థితిని గుర్తించిందని, అలాంటి కుటుంబాలు ప్రభుత్వ విద్యపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ఆ కుటుంబాల పిల్లలు ప్రయివేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల డోనేషన్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలే ఆధారం అవుతున్నాయని పేర్కొన్నారు.

మహోన్నత లక్ష్యంతో ప్రతి ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, టేబుల్స్, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు, యూనిఫారాలు, షూస్, టైలు అందించడం, మధ్యాహ్న భోజన పథకానికి పౌష్టికాహారంతో కూడిన మెనూను రూపొందించి అమలు చేయడం గత ప్రభుత్వ కాలంలో జరిగిందని ఆయన వివరించారు.

కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కనీస అర్హత ప్రమాణాలు లేకుండానే మంత్రిగా కొనసాగుతున్న నారాయణకు చెందిన విద్యాసంస్థలకు ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇస్తున్నారని, చైతన్య విద్యాసంస్థల వారు అధికార పార్టీకి వందల కోట్ల రూపాయలను వాటాల రూపంలో సమకూరుస్తున్నారని, రాజ్యసభ సభ్యుడికి చెందిన భాష్యం విద్యాసంస్థల అభివృద్ధికే ప్రభుత్వం కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వ్యతిరేకంగా విద్యను వ్యాపారంగా మార్చుతోందని ఆరోపించారు.

గత వైఎస్ జగన్ హయాంలో సామాన్య విద్యార్థికి అందుబాటులోకి డిజిటల్ క్లాస్‌లు, ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చారని, బాలికల విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమై, ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. బాలికలు చదువు మధ్యలో ఆపకుండా ఉన్నత విద్యను కొనసాగించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.

రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 3వ తరగతి నుండి డిగ్రీ వరకు ఒకే ప్రాంగణంలో విద్యా సౌకర్యాలు కల్పించడం గత జగన్ ప్రభుత్వ ఘనతగా ఆయన పేర్కొన్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా హక్కుగా భావించి ‘అమ్మ ఒడి’ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి, పేద కుటుంబాల పిల్లలు చదువుకు దూరం కాకుండా ప్రోత్సహించారని వివరించారు. ధనవంతుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో పొందుతున్న సౌకర్యాల స్థాయిలోనే పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలన్నదే జగన్ ప్రభుత్వ కలగా ఆయన వ్యాఖ్యానించారు.

పాఠశాలల్లో ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టి రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, పరిశుద్ధ త్రాగునీటి కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం పాఠశాల ప్రారంభానికి ముందే పుస్తకాలు, యూనిఫారాలు అందించేదని, కానీ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతలేని బ్యాగులు, సమయానికి అందని యూనిఫారాలు, పుస్తకాల పంపిణీలో జాప్యం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని విమర్శించారు.

పెండింగ్‌లో ఉన్న ఐదు శాతం, పది శాతం ‘నాడు–నేడు’ పనులను తక్షణం పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ విద్యా వ్యవస్థను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఉద్యమం చేపడుతోందని తెలిపారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు, ఫర్నిచర్, డిజిటల్ బోర్డులు, తరగతి గదులు మరియు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలు ఈ మార్పుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని చెప్పారు.

రాయచోటి మున్సిపాలిటీ మాత్రమే కాకుండా, ప్రతి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులను ఫోటోల ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, గతంలో జరిగిన మంచి పనులను కొనసాగిస్తూ మిగిలిన పనులను పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.