రాయలసీమ న్యూస్, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఐదు రోజులపాటు సుడిగాలి పర్యటనలు నిర్వహించనున్నారు. బుధ, గురువారాల్లో తిరుపతి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యక్రమాలు సిద్ధమయ్యాయి. అనంతరం ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పలు పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
నియోజకవర్గ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తొలగించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి కుప్పానికి రావడం విశేషంగా మారింది. స్థానిక రాజకీయ, అభివృద్ధి పరిస్థితులను స్వయంగా పరిశీలించి చక్కదిద్దేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
కుప్ప నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో పార్టీపరంగా చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై స్థానిక నేతలతో సమాలోచనలు జరపాలని ఆయన ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కుప్పలో ఒకే బహిరంగ సభ, కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి పర్యటన ముగిసేది. అయితే ఈసారి ఆ విధానానికి భిన్నంగా రెండు బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు, మూడుసార్లు పార్టీ నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. స్థానిక నాయకత్వం, పార్టీ నిర్మాణం, కార్యకర్తలతో సమన్వయం వంటి అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
కుప్పలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం కానున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై సంతృప్త స్థాయిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన అధికారులతో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రజా సేవల అందుబాటు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉంది.
మూడు రోజులపాటు పెద్దగా విరామం లేకుండానే కుప్పలో ముఖ్యమంత్రి పర్యటనలు సాగనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారులతో సమీక్షలు, పార్టీ నేతలతో సమావేశాలు, బహిరంగ సభలు వరుసగా ఉండేలా కార్యక్రమాలు రూపొందించారు. ఈ పర్యటనతో కుప్ప నియోజకవర్గంలో అభివృద్ధి, రాజకీయ పరిపాలనలో కొత్త ఊపిరి నింపాలని ప్రభుత్వం, పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.













