రాయలసీమ న్యూస్, చిత్తూరు:
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
భూ మండలపురం గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆవేదనతో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తానూ తాగిన తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం భూ మండలపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, అదే గ్రామానికి చెందిన దివ్య దంపతులు. వీరి వివాహం పదేళ్ల క్రితం జరిగింది. గీత (7), హర్షిత్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ జీవితం సాగుతున్న సమయంలో సుబ్రహ్మణ్యం గత రెండేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు.
ఈ వ్యవహారంపై భార్య దివ్య పలుమార్లు సుబ్రహ్మణ్యాన్ని నిలదీసినప్పటికీ, అతడు ఆమెపై దాడి చేసి, హింసించేవాడని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇటీవల రెండు రోజులుగా సుబ్రహ్మణ్యం ఇంటికి రాకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో మహిళతోనే ఉంటున్నాడని సమాచారం.
శుక్రవారం సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన సమయంలో మరోసారి దివ్య అతనిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తాను చనిపోతే భర్త పిల్లలను పట్టించుకోడని భావించిన దివ్య, కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇద్దరు పిల్లలకు ఇచ్చి, తానూ తాగినట్లు పోలీసులు తెలిపారు.
విషం సేవించిన విషయం గ్రామస్థులు గమనించి, ముగ్గురినీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో హర్షిత్, గీత మృతి చెందారు. దివ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై దివ్య తల్లి సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం ఈ విషాదానికి కారణమైందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.













