రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: కడప డిస్ట్రిక్ట్ కో-ఓపెరటివే సెంట్రల్ బ్యాంకు Ltd. (Kadapa DCCB)లో స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 40 స్టాఫ్ అసిస్టెంట్, 23 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 7వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తులు kadapadccb.bank.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు సూచించిన లింక్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన వివరాలు, పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుంది.
ఈ నియామకానికి ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆధ్వర్యంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నియామకంలో ఇంటర్వ్యూలు ఉండవని బ్యాంకు స్పష్టం చేసింది.
స్టాఫ్ అసిస్టెంట్ కేటగిరీలో 40 పోస్టుల్లో 31 పోస్టులను ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 9 పోస్టులను ప్రైమరీ అగ్రికల్చరల్ కో- ఓపెరటివే సొసైటీస్ (PACS)లో పనిచేస్తున్న ఉద్యోగులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. PACS ఉద్యోగులు ఈ కేటగిరీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు, సేవా వివరాలు, ఇతర షరతులను నోటిఫికేషన్ ద్వారా పరిశీలించాలి.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, స్థానిక అభ్యర్థుల ప్రాధాన్యత, రిజర్వేషన్ నిబంధనలు, పరీక్ష విధానం వంటి వివరాలు కూడా నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని బ్యాంకు సూచిస్తోంది.
కడప DCCB 1919 సంవత్సరంలో స్థాపించబడింది. 1987లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగల్ విండో క్రెడిట్ డెలివరీ సిస్టం అమలులో భాగంగా, అప్పటి PADBsను డీసీసీబీ లో విలీనం చేశారు. ఒక్క రెవెన్యూ జిల్లాకు ఒక్క బ్యాంకు అనే సూత్రం ప్రకారం కడప డిస్ట్రిక్ట్ కో-ఓపెరటివే సెంట్రల్ బ్యాంకు Ltd. ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగుతోంది.













