శ్రీశైలం ఘాట్‌ రోడ్డుకు ఎలివేటెడ్‌ కారిడార్‌ – కేంద్రం సూత్రప్రాయ ఆమోదం

శ్రీశైలం వెళ్లే ఘాట్‌ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ను రూపకల్పన చేసి నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం.

నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆత్మకూరు–దోర్నాల మధ్య 42 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. త్వరలోనే ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

కర్నూలు–గుంటూరు రహదారి శ్రీశైలం వెళ్లే భక్తులకు అత్యంత కీలక మార్గంగా మారింది. ఈ రహదారి ద్వారా కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం పరస్పరం అనుసంధానమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న వన్యజీవుల సంరక్షణకు భంగం కలగకుండా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తెలంగాణలోని అచ్చంపేట నుంచి అమ్రాబాద్‌ మీదుగా పాతాళగంగ వరకు, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దోర్నాల వరకు 765వ నేషనల్‌ హైవేను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 86.74 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు.

ఈ మార్గంలో నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో, వాటి జీవవైవిధ్యానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఎలివేటెడ్‌ కారిడార్‌ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఎక్కడ ఎన్ని కల్వర్టులు, ఎక్కడ ఎలాంటి ఎలివేటెడ్‌ నిర్మాణాలు అవసరమో వంటి అంశాలపై వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (WII) సమగ్ర అధ్యయనం చేయనుంది.

ప్రతి ఏడాది శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వీకెండ్‌ రోజుల్లో ముఖ్యంగా హైదరాబాద్‌, తెలంగాణ జిల్లాల నుంచి శ్రీశైలం వెళ్లే వాహనాల రద్దీ మరింతగా పెరుగుతోంది. ఆర్టీసీ బస్సులతో పాటు భక్తులు తమ స్వంత వాహనాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు.

ప్రస్తుతం నల్లమల ఘాట్‌ రోడ్డులో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం అమల్లో ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ పూర్తయి వినియోగంలోకి వస్తే, ఇటువంటి ఆంక్షలు లేకుండా రాత్రి వేళల్లో కూడా శ్రీశైలం ప్రయాణం సాధ్యమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే కర్నూలు–ఆత్మకూరు 340C నేషనల్‌ హైవేను నాలుగు లైన్లుగా విస్తరించారు. అయితే ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు అటవీ శాఖ అనుమతులు ఆలస్యమవడంతో పనులు నిలిచిపోయాయి. ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదించిన 42 కిలోమీటర్లలో కేవలం 3 కిలోమీటర్ల మేర మాత్రమే రెండు వరుసలుగా విస్తరించగా, మిగిలిన 39 కిలోమీటర్ల రహదారి ఒక్క లైన్‌గా ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే ప్రధాని మోదీ శ్రీశైలం సందర్శించిన సమయంలో కూడా ఎలివేటెడ్‌ కారిడార్‌ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం, ప్రాజెక్టు అమలుకు దారితీసే కీలక అడుగుగా భావిస్తున్నారు.