రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శనివారం రాత్రి వరుస చోరీలు చోటుచేసుకుని స్థానికులను కలవరపరిచాయి. పట్టణంలోని మూడు ప్రాంతాల్లో దొంగలు పడి నగదు, ద్విచక్రవాహనాలు, సిగరెట్లు, సరకులు, సీసీ కెమెరాను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
గాంధీనగర్‌లో సత్యనారాయణకు చెందిన పాల డెయిరీలో దొంగలు చోరీ చేశారు. డెయిరీ నుంచి సుమారు రూ.లక్ష నగదు, ఒక సెల్‌ఫోన్, ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలు అపహరించినట్లు సమాచారం. సంఘటన జరిగిన సమయంలో డెయిరీ మూసివేసి ఉండగా, తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు బాధితులు పేర్కొన్నారు.
పీఆర్టీ కాలనీలో చేనేత వ్యాపారి రామాంజనేయులు ఇంటి బయట నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనం కనిపించకపోవడంతో ఆయన పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
లక్ష్మీచెన్నకేశవాపురం శివారులో జరీనా నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో కూడా దొంగతనం జరిగింది. దుకాణం విద్యుత్ తీగలను కత్తిరించి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.5 వేలు విలువైన సిగరెట్లు, వివిధ సరకులు, దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను దోచుకెళ్లారు. ఉదయం దుకాణం తెరిచిన జరీనా చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మూడు ఘటనలపై బాధితులు శనివారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ రెడ్డెప్ప చోరీలు జరిగిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సంఘటన స్థలాల్లో ఆధారాలు సేకరించి, పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
పీఆర్టీ కాలనీలో ద్విచక్రవాహనం ఎత్తుకెళ్తూ చోరుడు, అతడి వెంట వచ్చిన ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా దొంగల గుర్తింపుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. పట్టణంలో ఇటీవలి కాలంలో చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గస్తీని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.













