రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి:
కదిరిలో భార్య హత్య కేసులో భర్త అరెస్ట్ –
బాలిక కిడ్నాప్, బాల్యవివాహం కేసులో ఐదుగురు పట్టుబాటు
శ్రీ సత్య సాయి జిల్లా జిల్లాలో రెండు వేర్వేరు నేర కేసుల్లో పోలీసులు కీలక అరెస్టులు చేశారు. కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో జరిగిన భార్య హత్య కేసులో భర్తను అదుపులోకి తీసుకోగా, బొమ్మనహాళ్ మండలంలో బాలిక కిడ్నాప్, బాల్యవివాహం ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు.
కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో బుధవారం వేకువజామున సునీత అనే మహిళను గొంతుకోసి హత్య చేసిన ఘటనకు సంబంధించి భర్త గంగరాజును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతురాలి సోదరి అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా గంగరాజు కుటాగుళ్ల సమీపంలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. గంగరాజుపై రిమాండ్ విధించగా, అతని వద్ద నుంచి కత్తి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఇక బొమ్మనహాళ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి, ఆలయంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా బాల్యవివాహం జరిపిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని ఆలయంలోకి తీసుకెళ్లి వివాహం జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ ఘటనకు సహకరించిన బి.వన్నూరుస్వామి, ఎల్లప్ప, గంగమ్మ, బి.ఆంజనేయులు, బి.పల్లవి అలియాస్ మారెక్కలను శుక్రవారం అరెస్టు చేసి రాయదుర్గం కోర్టులో హాజరు పరిచారు.
నిందితులపై న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్సై నబిరసూల్ తెలిపారు. బాల్యవివాహాలపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, ఇలాంటి ఘటనల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బాలల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తల్లిదండ్రులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.













