రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
వికసిత్ భారత్ రోజ్‌గార్ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. గురువారం తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ముక్కువారిపల్లిలో వీబీ -జీ రామ్ జీ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కూటమి హయాంలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు.
త్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్..
ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పుట్టపర్తికి ఫైటర్ జెట్ పరిశ్రమ రాబోతోందని చెప్పుకొచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని పునరుద్ఘాటించారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఏడాదికి 185 రోజులు పేదవాళ్లకు ఈ పథకం పని కల్పిస్తుందని వివరించారు. దొంగ లెక్కలు రాసుకోలేని విధంగా డిజిటల్ విధానాన్ని ఈ పథకంలో అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. వీబీ -జీ రామ్ జీ పథకంలో రాష్ట్రాల వాటా 10శాతం నుంచి 40శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం కొత్త ఆలోచనలు, విధానాలతో ముందుకెళ్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా మారుతుందని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది..
ఏపీలో ఓ గొడ్డలి పార్టీ ఉందని.. ఆ పార్టీ రోజుకో డ్రామా ఆడుతోందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు అమరావతికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారని.. అధికారంలోకి వచ్చాక ఆయన మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. అమరావతిని ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల సంగతిని వేంకటేశ్వరస్వామి చూసుకుంటారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
గ్రామాలకే అధికారం: శివరాజ్ సింగ్
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వీబీ జీరామ్‌జీ పథకం తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ‘‘ వీబీ జీరామ్‌జీ పథకం కింద రూ.7.5లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం రూ.2 కోట్లు అందజేస్తాం. చేసిన పనికి వేతనం ఆలస్యం కాకూడదనే మార్పులు చేశాం. కార్మికుడి కష్టానికి సరైన న్యాయం చేయాలని సంకల్పించాం. నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమవుతాయి. గ్రామాల వికాసానికి ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఏ పనులు చేపట్టాలన్నా గ్రామాలకే అధికారం కల్పించాం. ఈ పథకం కింద ఏ పనులు చేయాలన్నా స్థానికంగానే నిర్ణయం తీసుకోవచ్చు’’ అని శివరాజ్ సింగ్ వెల్లడించారు.
ఏపీకి అండగా ప్రధాని మోదీ: పవన్
ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని అన్నారు. ‘‘ పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీరామ్‌జీ తీసుకొచ్చాం. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ముఖ్యమైంది. ఏపీలో ఈ కార్యక్రమం అమలు చేసేందుకు మొత్తం రూ.12,845 కోట్లు ఖర్చు చేయనున్నాం. గత రెండేళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల కోసం రూ.16,695 కోట్ల ఉపాధి నిధులు వినియోగించాం. 7వేల కి.మీ సీసీ రోడ్లు, 15,500 పశువుల నీటితొట్టెలు నిర్మించాం. శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుంది’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.













