బద్వేలు: ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఊరట కల్పించే లక్ష్యంతో ప్రతి రేషన్ కార్డుకు 10 కిలోల చొప్పున బియ్యం విక్రయించాలని నిర్ణయించింది. స్టీమ్ బియ్యం కిలోను రూ.52కు, సాధారణ బియ్యం కిలోను రూ.50కు అందుబాటులోకి తెస్తూ, మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే విక్రయాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుబజారు కేంద్రాలలో రైస్ మిల్లుల అవుట్‌లెట్ స్టోర్ల ద్వారా బియ్యం పంపిణీ, విక్రయాలను ప్రారంభించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బద్వేలు రైతుబజారు కేంద్రంలో ఈ విక్రయాలను అధికారికంగా ప్రారంభించారు. బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి ఎ. చంద్రమోహన్, కడప డిఎస్ ఓ రఘురాం, డీసీసీ బ్యాంక్ చైర్మన్, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం. సూర్యనారాయణ రెడ్డి కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరువు సమయంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నదని వారు వివరించారు. రైతుబజారు కేంద్రాల ద్వారా బియ్యం విక్రయం జరగడం వల్ల ప్రజలకు సులభంగా, తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో తహశీల్దార్ ఎ. తిరుమల బాబు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ శివశంకర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా కార్యక్రమానికి హాజరై బియ్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కరువు ప్రభావం మధ్య ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.