ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ వైద్య కమిషన్ ఎన్‌ఎంసీ శుభవార్తను అందించింది. రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపును ఆమోదించింది. ఈ మేరకు కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచుతూ ఎన్‌ఎంసీ అనుమతి జారీ చేసింది.

కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 ఎంబీబీఎస్ సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ ఓకే చెప్పింది. దీంతో కడపలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు, నెల్లూరులో 175 నుంచి 200కు పెరిగింది.

రాష్ట్రానికి కేంద్రం ఈ అదనపు సీట్లను కేటాయించడంతో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 100 కొత్త ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరయ్యాయని ఆయన వివరించారు.

కొత్తగా పెంచిన సీట్లకు సంబంధించి ఎన్‌ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎల్‌వోపీ మంజూరు చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. కేంద్రం, ఎన్‌ఎంసీ అనుమతులతో కడప మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు చేరగా, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎన్‌ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపక సిబ్బంది నియామకం కారణంగా ఈ అనుమతులు లభించాయని డీఎంఈ డాక్టర్ ఎ విష్ణువర్ధన్ తెలిపారు. ఎన్‌ఎంసీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని, మెడికల్ కాలేజీల్లో అన్ని అవసరమైన వసతులు ఉన్నప్పుడే సీట్లకు అనుమతులు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రభుత్వం భారీగా మౌలిక వసతుల అభివృద్ధి, ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టిందని డీఎంఈ వివరించారు. ఎన్‌ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఈ అదనపు సీట్లకు అనుమతులు వచ్చాయని ఆయన అన్నారు.

మెడికల్ కాలేజీలలో ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించినప్పుడు యంత్రాంగం, సిబ్బంది సమర్థవంతంగా పనిచేసినట్లు డీఎంఈ డాక్టర్ ఎ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలలో వసతుల కల్పనలో అధికారుల పాత్ర కీలకమైందని, అదనపు సీట్లు సాధించడంలో కృషి చేసిన కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆయన అభినందించారు. ఈ రెండు మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీ, వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రానికి కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లు లభించడంతో వైద్య విద్యలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.