రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. వీరపునాయునిపల్లె మండలం పాలగిరి గ్రామంలో "ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "ఆర్‌ఎం కిసాన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్" మరియు "కృషి విజ్ఞాన కేంద్రం–బారామతి" మధ్య సాంకేతిక సమాచార పరస్పర అవగాహన కార్యక్రమాన్ని ఆయన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ, వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సమతుల్య పోషక నిర్వహణ, సేంద్రియ సాగు, నీటి పొదుపు సాంకేతికతలు, సమగ్ర పంటల యాజమాన్య విధానాలను రైతులు అవలంబించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశోధనా సంస్థలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలు సమన్వయంతో పనిచేస్తే వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి, శాస్త్రవేత్తల సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతిభ బయోటెక్ సంస్థ రైతాంగ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 2023లో వీరపునాయునిపల్లె మండలం పాలగిరి గ్రామంలో 95 ఎకరాల విస్తీర్ణంలో ఆర్‌ఎం కిసాన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
దేశ రైతాంగానికి శాస్త్రీయ వ్యవసాయ పరిజ్ఞానాన్ని చేరవేయాలనే లక్ష్యంతో ఈ పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేశారని కలెక్టర్ వివరించారు. ఆర్‌ఎం కిసాన్ సెంటర్‌లో రైతులకు పూర్తిగా ఉచితంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సేంద్రియ వ్యవసాయం, పోషక పదార్థాల సమతుల్య వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, పంటల నిర్వహణ, ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. రైతుల ఆదాయం పెంచే వినూత్న వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా పరిచయం చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కృషి విజ్ఞాన కేంద్రం–బారామతి శాస్త్రవేత్తలతో సాంకేతిక సహకారానికి శ్రీకారం చుట్టడం ద్వారా అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. శాస్త్రీయ సాగు పద్ధతులపై నిపుణుల మార్గదర్శకంతో రైతులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని నిర్వాహకులు వివరించారు.
ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 16 రాష్ట్రాల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సహజ, సేంద్రియ, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు నిరంతరం శిక్షణ అందిస్తున్న ఆర్‌ఎం కిసాన్ ప్రతినిధుల బృందం, మన జిల్లాలో కూడా రైతులకు సమగ్ర వ్యవసాయ సేవలను అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో నవీన ఆవిష్కరణలకు వేదికగా ఆర్‌ఎం కిసాన్ సెంటర్ అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, స్థానిక నాయకులు పుత్తా నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఉద్యాన శాఖ అధికారి రవి చంద్ర, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













