రాయలసీమ న్యూస్, అనంతపురం: మండల పరిధిలోని యలగలవంక గ్రామానికి చెందిన హరిజన కేశన్న (40) కల్వర్టు కింద ఉన్న నీటి కుంటలో శవంగా తేలియాడుతూ కనిపించిన ఘటన గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం హరిజన కేశన్న గత మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆయన బంధువుల ఊరికి వెళ్లి ఉంటాడని, అక్కడి నుంచి తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు భావించినట్లు తెలిసింది. అయితే ఆయన ఎక్కడికెళ్లాడన్న విషయం ఎవరికీ తెలియలేదు.
శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద నుంచి దుర్వాసన రావడంతో అక్కడుగా వెళ్తున్న పశువుల కాపరులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారు కల్వర్టు కింద ఉన్న నీటి కుంటను నిశితంగా గమనించగా నీటిలో ఒక శవం తేలియాడుతూ కనిపించింది. వెంటనే వారు గ్రామానికి వెళ్లి ఈ విషయాన్ని తెలియజేశారు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మృతదేహం హరిజన కేశన్నదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ దృశ్యాన్ని తట్టుకోలేక మృతుని బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
హరిజన కేశన్నకు భార్య మౌనిక, కుమారులు మనోహర్, మధు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులతో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో ఇంటి పెద్దను కోల్పోవడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ కుటుంబం భవిష్యత్తుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మరణానికి గల కారణాలు, ఘటన జరిగిన సమయం, పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.













