రూ.750 కోట్ల పెట్టుబడి.. 4 వేల మందికి ఉపాధి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్‌ గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ (జీపీసీ)కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూలై 1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం రెవెన్యూ పరిధిలో హీరో మోటార్స్‌ విస్తరించనున్న కొత్త విడిభాగాల తయారీ కేంద్రానికి సీఎం భూమిపూజ చేయనున్నారు.

రూ.750 కోట్ల పెట్టుబడితో జీపీసీ–2.0ను నిర్మించేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 4 వేల మందికి ఉద్యోగావకాశాలు కలుగనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే శ్రీసిటీ సమీపంలో ఉన్న హీరో మోటార్స్‌ యూనిట్‌ ఏడాదికి 1.5 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.

దేశ, విదేశాల్లో వినియోగంలో ఉన్న మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లు, ఈవీలకు అవసరమైన విడిభాగాలను తయారు చేయడానికి గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణకు సంస్థ ప్రాధాన్యం ఇస్తోంది.

ఇప్పటికే పీ–4 కార్యక్రమంలో మార్గదర్శిగా కొనసాగుతున్న హీరో మోటార్స్‌ సంస్థ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ ద్వారా బ్రిజ్‌ మోహన్‌లాల్‌ ముంజల్‌ పేరుతో ‘హీరోస్‌ ఆఫ్‌ టుమారో’ పేరిట స్కాలర్‌షిప్‌ పథకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. అలాగే, పోలీసులు వినియోగించుకునేలా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వాహనాలను కూడా సీఎం అందజేయనున్నారు.

సత్యవేడు మండలం మాదనపాళెం రెవెన్యూ పరిధిలో 600 ఎకరాల్లో హీరో మోటార్స్‌ యూనిట్‌ స్థాపనకు 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీఐఐసీ ద్వారా భూమిని కేటాయించారు. అనంతరం 2018 మార్చి 23వ తేదీన రూ.1600 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్స్‌ తన 8వ ప్రపంచ స్థాయి తయారీ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు.

12 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రారంభమైన హీరో మోటార్స్‌ యూనిట్‌ ఇప్పుడు విస్తరణ దశకు చేరుకుంది. అదే యూనిట్‌లో విడిభాగాల తయారీ కేంద్రం ఏర్పాటు కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయడం గమనార్హం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల పెంపు దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.