ఏడాది పొడవునా సాగు చేసే ప్రధాన ఉద్యాన పంట అరటి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పంటకు ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీ9 రకం అరటి మార్కెట్‌లో రికార్డు స్థాయి ధరలను నమోదు చేస్తోంది.

రైల్వేకోడూరు ప్రాంతంలో జీ9 రకం అరటి టన్ను ధర కాయల నాణ్యతను బట్టి సుమారు రూ.24 వేల వరకు పలుకుతుండగా, రాజంపేట ప్రాంతంలో అదే రకం టన్ను రూ.28-30 వేల మధ్య అమ్ముడవుతోంది. సుగంధాలు, అమృతపాణి రకాల అరటి టన్ను ధరలు సుమారు రూ.20 వేల వరకు నమోదవుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా అరటి సాగుదారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏటా సుమారు 16,212 హెక్టార్లలో అరటి సాగు జరుగుతోంది. ఇందులో జీ9 రకం అధికంగా ఉండగా, సుగంధాలు, అమృతపాణి, యాలకులు, బొంత అరటి, ఎర్ర అరటి వంటి రకాలు కూడా మోస్తరు స్థాయిలో సాగవుతున్నాయి. జిల్లా పరిధిలో పండించే అరటి పంటకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంది.

రిలయన్స్ మార్ట్, హెరిటేజ్ వంటి కార్పొరేట్ సంస్థలు జిల్లాలో పండే అరటి దిగుబడులను నేరుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇతర వ్యాపారులు ఐదు నుంచి పది టన్నుల వరకు వాహనం ఒకేచోట లోడింగ్ అయితేనే మంచి ధరలు చెల్లిస్తున్నారు. ఒకేచోట వాహనం భర్తీ కాకపోతే ఊరూరా తిరిగి లోడింగ్ చేసుకోవాల్సి రావడంతో వారి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ అదనపు ఖర్చులను రైతులకు ఇచ్చే ధరల్లో కోత విధించడం వల్ల చిన్న స్థాయి రైతులు కొంత నష్టపోతున్నారని స్థానికులు చెబుతున్నారు.

రైల్వేకోడూరు, రాజంపేట, పరిసర ప్రాంతాల్లో పండించే అరటి ప్రస్తుతం దిల్లీ, బిహార్, గుజరాత్, మైసూర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. సాధారణంగా జిల్లాలో ఏప్రిల్, మే నెలాఖరుకే అరటి కోతలు పూర్తవుతాయి. తరువాత స్వల్పంగా మాత్రమే దిగుబడులు వస్తుంటాయి. అయితే ఈసారి కొంత ఆలస్యంగా సాగు ప్రారంభం కావడంతో ప్రస్తుతం దిగుబడులు మధ్యస్థంగా ఉన్నాయి.

ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు అరటి సరఫరా తగ్గడం, స్థానికంగా దిగుబడులు మధ్యస్థంగా ఉండటం కలిసి ధరలను పైకి తీసుకెళ్లినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అరటితో పాటు బొప్పాయి ధరలు కూడా టన్ను రూ.20 వేలకుపైగా నమోదవుతున్నాయి.

మూడేళ్లుగా ప్రతి పంటలోనూ నష్టాలే చూశాం. మా ఐదెకరాల పొలంలో ఏటా అరటి, బొప్పాయి, దోస వంటి పంటలు సాగు చేస్తుంటాం. ఈసారి జీ9 రకం అరటి కోసం ఐదెకరాలకు సుమారు రూ.7 లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు మంచి ధర రావడంతో సుమారు రూ.16 లక్షల వరకు వచ్చింది. చాలారోజుల తరువాత లాభాలు చూశాం.

అని ఉర్లగట్టుపోడుకు చెందిన అరటి రైతు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాలుగా వరుస నష్టాలు చూసిన రైతులకు ఈసారి అరటి ధరలు కొంత ఊరటనిస్తున్నాయని స్థానిక రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.