రాయలసీమ న్యూస్, అన్నమయ్య: చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యారంగంలోనే కాకుండా క్రీడలు, ఆత్మరక్షణ విద్యలతో పట్టణంలో తమ పాఠశాలను అగ్రగామిగా నిలుపుతున్న విజయభారతి విద్యాసంస్థల నూతన ప్రిన్సిపల్ నిశ్చితాసేతు ఇప్పుడు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. తోటి మిత్రబృందంతో కలిసి ‘హనుమత్ సుందరకాండ’ పేరుతో యానిమేషన్ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాతగా మారారు.
ఈ నేపథ్యంలో మదనపల్లె విజయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీజర్ రిలీజ్ వేడుకకు విజయభారతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. సేతు, ప్రముఖ డాక్టర్లు అనిల్ కుమార్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, BJP సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, BJP జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర రెడ్డి, బండి ఆనంద్, చంద్రశేఖర్ రెడ్డి, మహేష్ నారాయణ, కిషోర్ తదితరులు చిత్రబృందంతో కలిసి హాజరయ్యారు.
కార్యక్రమంలో ప్రదర్శించిన ‘హనుమత్ సుందరకాండ’ టీజర్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. హనుమాన్ పాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్లో భక్తి భావాన్ని రేకెత్తించడంతో పాటు రోమాలను నిక్కబొడుచుకునేలా ఉన్నాయని అతిథులు అభిప్రాయపడ్డారు. యానిమేషన్ రూపంలో హనుమాన్ గాథను తెరపైకి తీసుకురావాలనే దర్శకుడి ప్రయత్నాన్ని వారు ప్రశంసించారు.
అలాగే ఇంత విస్తృతమైన యానిమేషన్ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చిన నిర్మాత నిశ్చితాసేతు, ఆమెతో కలిసి పనిచేస్తున్న మిత్రబృందాన్ని అతిథులు అభినందించారు. విద్యారంగంలో సేవలందిస్తున్న ఒక స్కూల్ ప్రిన్సిపల్ చలనచిత్ర నిర్మాణం వైపు అడుగుపెట్టడం విశేషమని, ఇది విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.
‘హనుమత్ సుందరకాండ’ యానిమేషన్ చిత్రం వచ్చే ఏడాది వినాయక చవితి సందర్భంగా విడుదల కానుందని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ చిత్రం మొత్తం ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాంతీయ భాషలతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు.
వినాయక చవితి సందర్భంగా విడుదలయ్యే ఈ యానిమేషన్ చిత్రం ఘనవిజయం సాధించాలని, హనుమాన్ భక్తులకు, కుటుంబ ప్రేక్షకులకు ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతిని అందించాలని కార్యక్రమానికి హాజరైన అతిథులు ఆకాంక్షించారు. మదనపల్లె పట్టణం నుంచి ఇలాంటి యానిమేషన్ చిత్రం రూపుదిద్దుకోవడం స్థానికులకు గర్వకారణమని వారు భావించారు.













