రాయలసీమ న్యూస్, నంద్యాల: అహోబిలం మఠంలో తలనీలాల సేకరణ, టెండర్ ప్రక్రియ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. మఠం మాజీ అధికారి కారులో 150 కిలోల తలనీలాల సంచులు తరలిస్తుండగా పట్టుబడిన ఘటన, చెన్నైకు చెందిన గుత్తేదారుడికి ఓ నేత చరవాణిలో బెదిరింపులు చేసిన విషయం బయటపడటంతో ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అహోబిలం మఠానికి ప్రధాన ఆదాయం తలనీలాల నుంచే వస్తోంది. ఆలయానికి ఏటా మూడు లక్షల మంది వరకు భక్తులు దర్శనానికి వస్తారు. వీరిలో ఎక్కువ మంది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తుండగా, తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. తలనీలాల సేకరణకు ఏడాదికోసారి టెండర్ నిర్వహిస్తారు. వేలం పాటలు సక్రమంగా జరిగితే సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుందని మఠం వర్గాలు చెబుతున్నాయి.
టెండర్ ప్రక్రియలో పాల్గొనే గుత్తేదారులను కొందరు నాయకుల అండతో బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే తలనీలాలు అక్రమార్కులకు ఆదాయ మార్గాలుగా మారాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. తలనీలాలు చోరీ చేశారన్న ఆరోపణలపై మఠం ఉద్యోగులు ఇద్దరు ఇటీవల సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా మఠం మాజీ అధికారి తన కారులో తలనీలాల సంచులు తరలిస్తుండగా తెదేపా నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డి అడ్డుకుని, వాటిని పోలీసుల చేతికి అప్పగించారు. ఈ ఘటనతో తలనీలాల వ్యవహారంపై మరింత దృష్టి పడింది.
చెన్నైకు చెందిన దురై కంపెనీ యజమాని తలనీలాల టెండర్ వేసిన నేపథ్యంలో, తమ అనుమతి లేకుండా టెండర్ ఎలా వేస్తారంటూ ఓ నేత చరవాణిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం. అహోబిలంలో తలనీలాల టెండర్ వేసుకోవాలంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాలంటూ, ఇక్కడికి వస్తే పరిస్థితులు తెలుస్తాయని, రాబోయే రోజుల్లో ఇంకా ఫోన్లు వస్తాయని, అతనికి ఎవరు మద్దతు ఇస్తున్నారో తెలుసునని, ఆ వాహనం అహోబిలం వస్తే కేసు పెడతామని ఆ నేత హెచ్చరించినట్లు ఆడియో సంభాషణల్లో వినిపిస్తోంది.
ఈ బెదిరింపులకు సమాధానంగా గుత్తేదారుడు టెండర్లు వెనక్కి తీసుకున్నానని, ఆ మొత్తం ఇంకా తనకు రావాలని ఫోన్లో వాపోయిన సంభాషణలు కూడా బయటకు వచ్చాయి. తలనీలాల వేలం పాటను మఠం అధికారులు రద్దు చేసిన తర్వాత కొందరు అక్రమంగా తలనీలాలు దొంగలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తలనీలాలు అక్రమంగా తరలింపుపై నిఘా ఉంచి వాహనాలను పట్టుకున్నామని, దాన్ని కప్పిపుచ్చేందుకు వైకాపా నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. టెండర్ రాని దురై కంపెనీకి తలనీలాలు ఎలా వెళ్తున్నాయో, కొందరు మఠం అధికారులు వైకాపా నాయకులతో కుమ్మక్కయ్యారో అనే అంశాలపై మఠం పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ అనంతరం అహోబిలం వ్యవహారాలు నిర్వహించడంలో విఫలమైన సీఏవోను తొలగించినట్లు మఠం వర్గాలు పేర్కొంటున్నాయి.
దురై కంపెనీ యజమానిని బెదిరించినట్లు ఉన్న ఆడియోను గతంలోనే పోలీసులకు అందజేసినా, అప్పట్లో చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు లేవుతున్నాయి. వేలం రోజున దురై కంపెనీకి తలనీలాలు విక్రయించొద్దని ఆందోళన చేసిన వైకాపా నాయకులకు ఇప్పుడు ఆ కంపెనీపై ఎందుకు ప్రేమ పుట్టిందో, దొంగతనంగా తరలిస్తున్న తలనీలాలను దురై కంపెనీ రహస్యంగా కొనుగోలు చేస్తుండటంతో వారికి మద్దతుగా వైకాపా నాయకులు నిలుస్తున్నారో అనే అంశాలపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంపై భూమా అఖిలప్రియ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వర్గాల నుంచి కూడా స్పందనలు వెలువడుతున్నాయి. తలనీలాల టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక భక్తులు, ప్రజలు కోరుతున్నారు.













